Telangana: రాష్ట్ర‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేటాయింపులు: తెలంగాణ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

  • ‘బంగారు తెలంగాణ’ లక్ష్యం సాకారం చేసే దిశగా బడ్జెట్ ఉంది
  • డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఈ బ‌డ్జెట్ లో రూ.2,643 కోట్లు
  • దేవాదాయ శాఖ‌కు కూడా ఈ బ‌డ్జెట్  కేటాయింపుల్లో పెద్ద‌పీట
  • యాదాద్రి ఆల‌య పున‌ర్నిర్మాణ ప‌నుల‌కు రూ.250 కోట్లు

‘బంగారు తెలంగాణ’ లక్ష్యం సాకారం చేసే దిశగా, రాష్ట్ర  ప్రజల ఆకాంక్షలను ప్ర‌తిబింబించేలా బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న జ‌రిగిందని, ఇది సంపూర్ణ బడ్జెట్ అని తెలంగాణ గృహ నిర్మాణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. బ‌డ్జెట్ వాస్త‌విక కోణంలో ఉంద‌న్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ఈ బ‌డ్జెట్ కేటాయింపులు ఉన్నాయ‌ని మంత్రి ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. తాను నిర్వ‌హిస్తోన్న‌ గృహ నిర్మాణ‌, దేవాదాయ‌, న్యాయ శాఖ‌ల‌కు బ‌డ్జెట్ కేటాయింపులు చేసినందుకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఈ బ‌డ్జెట్ లో 2,643 కోట్ల రూపాయాలు కేటాయించిన‌ట్లు వెల్ల‌డించారు. దేవాదాయ శాఖ‌కు కూడా ఈ బ‌డ్జెట్ కేటాయింపుల్లో పెద్ద‌పీట వేశార‌న్నారు. ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రమైన యాదాద్రి ఆల‌య పున‌ర్నిర్మాణ ప‌నుల‌కు రూ.250 కోట్లు, వేములవాడ దేవాల‌య అభివృద్ధికి రూ.100 కోట్లు, భ‌ద్రాద్రి ఆల‌య పున‌ర్నిర్మాణానికి రూ.100 కోట్లు, బాస‌ర స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి ఆల‌యాభివృద్ధికి రూ.50 కోట్లు, ధ‌ర్మ‌పురి దేవాల‌య అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించిన‌ట్లు చెప్పారు.

అర్చ‌కులు, ఆల‌య ఉద్యోగుల‌కు 2015 పీఆర్సీ ప్ర‌కారం పే స్కేల్ చెల్లింపుల కోసం రూ.72 కోట్లు కేటాయించిన‌ట్లు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బ‌ల‌హీన వ‌ర్గాల కాల‌నీల్లో నూత‌న ఆల‌య నిర్మాణం, ఆల‌యాల జీర్ణోధ‌ర‌ణ‌కు వ‌స్తోన్న విజ్ఞ‌ప్తుల మేర‌కు కామ‌న్ గుడ్ ఫండ్ కు రూ.50 కోట్లు కేటాయించార‌ని వెల్ల‌డించారు. అదే విధంగా న్యాయ‌వాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించార‌న్నారు.

More Telugu News