Congress: రణరంగమైన గుజరాత్ అసెంబ్లీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేను చుట్టిముట్టి పిడిగుద్దులు.. ఇద్దరు కాంగ్రెస్ సభ్యులపై మూడేళ్ల వేటు!

  • కాంగ్రెస్-బీజేపీ ఎమ్మెల్యేల బాహాబాహీ
  • అసెంబ్లీలో రోజంతా ఉద్రిక్తత
  • మైక్ విరగ్గొట్టి బీజేపీ సభ్యుడిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి
  • ముగ్గురిపై నిషేధం.. అసెంబ్లీ ఆవరణలోకి కూడా రావద్దని హెచ్చరిక

గుజరాత్ అసెంబ్లీ రణరంగంగా మారింది. బీజేపీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మూడేళ్లపాటు సస్పెండ్ చేశారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ ఓ అంశంపై మాట్లాడుతుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ కల్పించుకుని మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పీకర్ అందుకు నిరాకరించారు.

దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగడంతో విక్రమ్‌ను సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో మరో కాంగ్రెస్ సభ్యుడు అమ్రీష్ దెర్.. విక్రమ్‌కు మద్దతు ఇస్తూ మాట్లాడేందుకు ప్రయత్నించారు. స్పీకర్ వద్దని హెచ్చరిస్తున్నా వినిపించుకోకుండా తీవ్ర విమర్శలు చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే జగదీశ్ పంచల్ కల్పించుకుని అమ్రీష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు నిరిసనగా వెల్‌లోకి వెళ్లి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైక్ విరగొట్టి బీజేపీ ఎమ్మెల్యే జగదీశ్‌పై విసిరారు. సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.

సభ  తిరిగి ప్రారంభమైనా బీజేపీ-కాంగ్రెస్ మధ్య గొడవ చల్లారలేదు. పరస్పర వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అమ్రీష్ సభలోకి వచ్చి బీజేపీ ఎమ్మెల్యేపై దాడి చేశారు. దీంతో రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యేలు అమ్రీష్‌ను చుట్టుముట్టి పిడిగుద్దులు కురిపించారు. దీంతో సభ మరోసారి వాయిదా పడింది.

సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతాప్ దుధాత్, అమ్రిష్ దెర్‌లు మూడేళ్లుపాటు సస్పెండ్ చేసినట్టు స్పీకర్ ప్రకటించారు. మరో ఎమ్మెల్యే బాల్‌దేవ్‌జీ ఠాకూర్‌ను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. నిషేధ సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదని స్పీకర్ పేర్కొన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలను  సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్‌కు చెందిన మిగతా ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

More Telugu News