Rahul Gandhi: బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటైన 20 పార్టీలు.. సోనియా విందుకు హాజరు

  • వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి పావులు కదుపుతున్న కాంగ్రెస్
  • సోనియా విందుకు ప్రముఖులు హాజరు
  • విందు బ్రహ్మాండంగా జరిగిందంటూ రాహుల్ ట్వీట్

వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఇచ్చిన విందుకు 20 ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ, జేఎంఎం, లెఫ్ట్ పార్టీలు కూడా విందుకు హాజరయ్యాయి. తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ తన తరపున సుదీప్ బందోపాధ్యాయను పంపించారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాబ్ నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ తదితరులు హాజరయ్యారు.

విందు బ్రహ్మాండంగా జరిగిందని, ప్రేమపూర్వకమైన సమావేశంలో పలు విషయాలను చర్చించినట్టు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. భవిష్యత్ రాజకీయాలకు నిర్మాణం జరుగుతోందని ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ పేర్కొన్నారు. కాగా, ఈ విందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా, డీఎంకే నుంచి కనిమొళి, ఆర్జేడీ నుంచి లాలు కుమారుడు తేజస్వీ యాదవ్, కుమార్తె మిసా భారతి, జేఎంఎం నుంచి హేమంత్ సోరెన్, ఏఐయూడీఎఫ్ నుంచి బద్రుద్దీన్ అజ్మల్, సీపీఎం నుంచి మహ్మద్ సలీం, సీపీఐ నుంచి డి.రాజా, ఆర్‌ఎల్డీ నుంచి అజిత్ సింగ్ తదితరులు హాజరయ్యారు. సోనియాగాంధీ నేతృత్వంలో వీరంతా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

More Telugu News