Telugudesam: టీడీపీ ఎంపీలకు దక్కని అపాయింట్ మెంట్ ..అదే సమయంలో రైల్వే మంత్రిని కలిసిన వైసీపీ ఎంపీ!

  • టీడీపీ ఎంపీలకు ఇచ్చిన అపాయింట్ రద్దు 
  • అదేసమయంలో, గోయల్ ను కలిసిన వైసీపీ ఎంపీ వరప్రసాద్
  • ఉద్దేశపూర్వకంగానే తమకు ఇచ్చిన అపాయింట్ మెంట్ రద్దు చేశారు : టీడీపీ 

రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ను కలిసేందుకు టీడీపీ ఎంపీలకు అపాయింట్ మెంట్ లభించలేదు. కానీ, వైసీపీ ఎంపీ వరప్రసాద్ మాత్రం గోయల్ ను కలవడం చర్చనీయాంశమైంది. పార్లమెంట్ లో గోయల్ అపాయింట్ మెంట్ కోసం ఈరోజు ఉదయం నుంచి టీడీపీ ఎంపీలు పడిగాపులు గాచినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సాయంత్రం నాలుగు గంటలకు గోయల్ ను కలిసేందుకు తమ ఎంపీలకు అవకాశమిచ్చారు కానీ, ఆ తర్వాత, వాయిదా వేస్తున్నట్టు గోయల్ కార్యాలయం అధికారులు చెప్పడంతో ఆశ్చర్యపోయామని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయం పేర్కొంది.

అదేసమయంలో, తిరుపతి వైసీపీ ఎంపీ వరప్రసాద్ మాత్రం గోయల్ ను కలిశారు. తన నియోజకవర్గంలోని రైల్వే సమస్యలపై మంత్రికి వరప్రసాద్ రెండు వినతి పత్రాలు సమర్పించారు. గోయల్ ను వరప్రసాద్ కలిసిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.  కాగా, ఉద్దేశపూర్వకంగానే టీడీపీ ఎంపీలకు ఇచ్చిన అపాయింట్ మెంట్ ను రద్దు చేసి, అదే సమయంలో వైసీపీ ఎంపీకి అపాయింట్ మెంట్ ఇచ్చారనే అనుమానాన్ని టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలికి ఈ సంఘటనే అద్దం పడుతుందని విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉండగా, రైల్వేజోన్ సాధ్యం కాదంటే ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని, రైల్వే మంత్రి, పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ కు టీడీపీ ఓ లేఖ రాసింది.

More Telugu News