Air India One: భారత రాష్ట్రపతి, ప్రధానులకు కొత్త విమానాలు...ప్రత్యేకతలివే..!

  • ముగ్గురు ప్రముఖుల కోసం బోయింగ్-777 విమానాలు సిద్ధం చేస్తున్న ఎయిరిండియా వన్
  • నిర్విరామంగా అమెరికా చేరుకోగల సామర్థ్యం కొత్త విమానాల సొంతం
  • అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థలు, మీడియా సమావేశ గది, వీఐపీ ఎన్‌క్లోజర్ తదితర సదుపాయాలు

భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు 2020 కల్లా సకల సదుపాయాలున్న ప్రత్యేక విమానాలు సిద్ధం కానున్నాయి. ఎయిర్ ఇండియా వన్ ఇప్పటికే కొత్త విమానాలకు మెరుగులు దిద్దే పనుల్లో నిమగ్నమయింది. ఈ ముగ్గురు వీవీఐపీలకు ఉద్దేశించిన బోయింగ్-777 విమానాల్లో  అవసరమైన సకల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ విమానాలకు పలు విశిష్టతలు ఉన్నాయి. పలు సదుపాయాలతో పాటు అవసరమైన భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూడు విమానాల్లోని రెండింటిలో వీఐపీ ఎన్‌క్లోజర్, మీడియా సమావేశ గది, వైద్య అత్యవసర పరిస్థితుల కోసం రోగి రవాణా యూనిట్‌ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటికి తోడు వైఫై సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు.

అంతేకాక క్షిపణి నిరోధక వ్యవస్థలు, రాడార్ డాడ్జింగ్ యంత్రాంగాలతో పాటు ఇతర భద్రతా విశిష్టతలు ఈ విమానాల సొంతం. మరోవైపు అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థలు, కిచెన్, వీవీఐపీలకు వ్యక్తిగత గదులను కూడా ఇందులో ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోయింగ్ 747 విమానాలను వీవీఐపీల రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. బోయింగ్ 747-బోయింగ్ 777 విమానాలకు మధ్య ఓ అతిపెద్ద తేడా ఉంది. కొత్త బోయింగ్ విమానాలు అమెరికాకు నిర్విరామంగా ఏకబిగిన చేరుకోగలవు. బోయింగ్-777 విమానాలకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రెండు జీఈ90-115బీఎల్ ఇంజిన్లను అమర్చుతున్నారు. ఈ మూడు విమానాలను ఎయిర్ ఇండియా అన్ని రకాలుగా సిద్ధం చేయగానే వాటిని కొనుగోలు చేస్తామని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు.

More Telugu News