Telangana: హెడ్ ఫోన్ విసిరినందుకు కఠిన శిక్ష... కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసన సభ్యత్వాలపై వేటు

  • ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల పదవులపై వేటు
  • ప్రతిపాదించిన హరీశ్ రావు
  • ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ

నిన్న తెలంగాణ అసెంబ్లీలో నిరసనలు తెలుపుతూ కాంగ్రెస్ సభ్యులు హెడ్ ఫోన్స్ ను విసిరేసిన ఘటనపై టీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసన సభ్యత్వాలపై వేటు వేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ దాన్ని ఆమోదించింది. వారిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని హరీశ్ ప్రతిపాదించగా, స్పీకర్ మాట్లాడుతూ, చాలా దుర్మార్గంగా సభ్యులు వ్యవహరించారని, గత నాలుగేళ్లలో ఎన్నడూ ఇలా జరగలేదని అన్నారు. సభ్యులు వెంటనే బయటకు వెళ్లిపోవాలని కోరారు. మాటల్లో వర్ణించలేని ఆవేదన తన మనసులో ఉందని చెప్పిన స్పీకర్ మధుసూదనాచారి, తాము వేసిన శిక్ష చిన్నదేనని అన్నారు. సస్పెండ్ చేయబడిన, శాసన సభ్యత్వాలను పోగొట్టుకున్న వారు బయటకు వెళ్లాలని లేకుంటే మార్షల్స్ ను పిలవాల్సి వస్తుందని హెచ్చరించారు. క్లిప్పింగ్స్ అన్నీ చూసి, కావాలనే ఉద్దేశపూర్వకంగా కొందరు సభ్యులు ఇలా చేశారని తాను నిర్ణయానికి వచ్చానని అన్నారు. 

More Telugu News