New Delhi: ఒక్క అమ్మాయీ దొరకలేదు... 2017లో ఢిల్లీలో డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడని ఆడవాళ్లు!

  • ఢిల్లీ అమ్మాయిలు మందు కొట్టి వాహనం ముట్టట్లేదు
  • ఒక్క మహిళ కూడా పట్టుబడని వైనం
  • 26 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘనల్లో 600 మాత్రమే మహిళలవి

హైదరాబాద్ లో వారాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తే కనీసం ముగ్గురు నలుగురు అమ్మాయిలు పరిమితికి మించి మందుకొట్టి బ్రీత్ అనలైజర్ తనిఖీల్లో దొరికిపోతారన్న సంగతి తెలిసిందే. అయితే, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా వుంది. అక్కడ మహిళలు డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడడం అరుదేనని పోలీసులు చెబుతున్నారు. దీనికి సాక్ష్యంగా తమ వద్ద ఉన్న గణాంకాలు చూపుతారు. గత కొన్నేళ్లుగా దేశ రాజధానిలో క్రమంగా పరిస్థితి మారిపోయింది.

2017లో ఢిల్లీలో మొత్తం 26 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు విధించగా, అందులో 600 మాత్రమే మహిళలవి. ఇక, డ్రంకెన్ డ్రైవ్ విషయానికి వస్తే, ఒక్క మహిళ కూడా, పోలీసుల తనిఖీల్లో పట్టుబడలేదు. ఇతర అన్ని రకాల ట్రాఫిక్ ఉల్లంఘనల్లో యువతుల శాతం అత్యంత తక్కువని, యాక్సిడెంట్లు, మరణాల్లో 10 శాతం మహిళలు ఉంటున్నారని పోలీసులు వెల్లడించారు.

2017లో 1,67,867 మందిపై ట్రాఫిక్ సిగ్నల్ జంప్ కేసులు పెట్టగా, అందులో 44 మంది మహిళలు ఉన్నారని, పరిమితికి మించి వేగంగా వెళుతున్నట్టు 1,39,472 మందిపై కేసులు నమోదుకాగా, 514 మంది మాత్రమే మహిళలు ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. యాక్సిడెంట్లలో మహిళా డ్రైవర్ల ప్రమేయం కేవలం 2 శాతమేనని తెలిపారు. గణాంకాలను విశ్లేషించి చూస్తే పురుషులతో పోలిస్తే, మహిళల్లో జాగ్రత్త ఎక్కువని, నిబంధనలు కూడా చక్కగా పాటిస్తున్నారని అధికారులు అంటున్నారు.

More Telugu News