team india: ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా... ఫైనల్ కి చేరిక!

  • తొలి టీ20లో శ్రీలంక చేతిలో ఓడిన టీమిండియా
  • బౌలర్లు, బ్యాట్స్ మన్ సమష్టి కృషి
  • మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శార్థుల్ ఠాకూర్

నిదహాస్‌ ట్రై సిరీస్ లో తొలి టీ20 ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. వర్షం కారణంగా ఒక ఓవర్ కుదింపుకు గురైన టీ20లో టాస్ ఓడిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (55) అర్ధసెంచరీతో రాణించాడు. భారత బౌలర్లు చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో టీమిండియా ప్రధాన బౌలర్లంతా వికెట్లు తీయడం విశేషం. నాలుగు వికెట్లతో శార్ధుల్ ఠాకుర్ రాణించగా, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీశాడు, జయదేవ్ ఉనద్కత్, శంకర్, చాహల్ చెరొక వికెట్ తో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఉపుల్ తరంగ (22), దుశాన్ శనక (19) భారత బౌలర్లకు ఎదురొడ్డారు. దీంతో 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి శ్రీలంక జట్టు 152 పరుగులు చేసింది.

అనంతరం టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ వస్తూనే సిక్సర్ తో వాహ్ అనిపించాడు. తరువాత బంతిని బౌండరీలైన్ దాటించాడు. దీంతో టీమిండియా త్వరగానే లక్ష్యం ఛేదిస్తుందని అంతా భావించారు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో ఫ్రంట్ పుట్ కి వచ్చి ఆడిన రోహిత్ (11) మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేస్తున్న కుశాల్ మెండిస్ కి దొరికిపోయాడు. దీంతో 12 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.

అనంతరం ధావన్ (8) ధాటిగా ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయి మిడ్ ఆన్ లో తిశార పెరీరాకు క్యాచ్ ఇచ్చాడు. రిషబ్ పంత్ స్థానంలో చోటుదక్కించుకున్న లోకేష్ రాహుల్ (18) జాగ్రత్తగా ఆడాడు. తరువాత సురేష్ రైనా దూకుడుగా ఆడాడు. బంతిని బౌండరీ తరలించడమే లక్ష్యంగా బ్యాటు ఝళిపించాడు. దీంతో స్కోరు బోర్డు జోరందుకుంది. మంచి జోరుమీదున్న రైనా (27) ను ప్రదీప్ అవుట్ చేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే (42), దినేష్ కార్తిక్ (39) సంయమనంతో ఆడుతూ లక్ష్యం ఛేదించారు. నాలుగు వికెట్లతో రాణించిన శార్థుల్ ఠాకూర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. దీంతో రెండు టీ20ల్లో విజయం సాధించిన టీమిండియా ఫైనల్ చేరింది. టీమిండియా బుధవారం బంగ్లాదేశ్ తో తలపడనుంది.

More Telugu News