ఇళ్లకు 11కేవీ సప్లయ్....!బాంబుల్లా పేలిన టీవీలు, ఫ్రిడ్జిలు..బీటెక్ స్టూడెంట్ మృతి

12-03-2018 Mon 14:41
  • మీరట్‌, కువాన్ పట్టి ప్రాంతంలోని ఇళ్లకు ఒక్కసారిగా 11కేవీ సప్లయ్
  • ఇళ్లలోని పేలిన టీవీలు, ఫ్రిడ్జిలు..
  • మొబైల్ ఛార్జింగ్ పెడుతున్న బీటెక్ విద్యార్థి షాకుతో మృతి
  • బాధితుడి కుటుంబానికి 5 లక్షల పరిహారం, దర్యాప్తుకు ఆదేశం
సాధారణంగా ఇళ్లకు 230 ఓల్టుల సింగిల్ ఫేజ్ విద్యుత్‌ను సప్లయ్ చేస్తుంటారు. కానీ, మీరట్‌లోని ఇంచోలీ గ్రామం, కువాన్ పట్టి ప్రాంతంలోని దాదాపు 110 ఇళ్లకు ఉన్నట్లుండి 11కేవీ విద్యుత్ సరఫరా కావడంతో వాటిలోని టీవీలు, ఫ్రిడ్జిలు ఒకటి తర్వాత మరోటి బాంబుల్లా పేలాయి. ఆస్తినష్టంతో పాటు 20 ఏళ్ల బీటెక్ విద్యార్థి కూడా మృత్యువాత పడ్డాడు. ముగ్గురు మహిళలు సహా నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఓ ఇల్లు మంటలకు ఆహుతైంది. ఈ ప్రమాదంతో కోపోద్రిక్తులైన సదరు గ్రామస్థులు తమకు సమీపంలోని 119 నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వాధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారుల్ని వారించే ప్రయత్నం చేశారు.

మరోవైపు విద్యుత్ శాఖ బాధితుడి కుటుంబానికి నష్టపరిహారం కింద రూ.5 లక్షల చెక్కును అందజేసింది. సతేంద్ర దాస్ అనే బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి తన మొబైల్ ఫోనుకు ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తన ఇంటికి హఠాత్తుగా హైఓల్టేజీ సప్లయ్ కావడంతో విద్యుత్ షాకుతో అతను మరణించాడని ఎస్‌పీ (రూరల్) రాజేశ్ కుమార్ తెలిపారు. మరోవైపు టీవీ పేలడంతో దాని నుంచి ఎగసిన మంటలకు షాతీర్ అహ్మద్ అనే వ్యక్తి ఇల్లు తగలబడి పోయిందని ఆయన చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని, ప్రమాదానికి కారణమేంటో ఇంకా తెలియడం లేదని పశ్చిమంచల్ విద్యుత్ వితరన్ నిగమ్ లిమిటెడ్ (పీవీవీఎన్‌ఎల్) చీఫ్ ఇంజనీరు ఎస్‌బీ యాదవ్ తెలిపారు.