Amazon: టెన్త్ కూడా పాస్ కాలేదు...కానీ 'అమేజాన్‌'కే టోపీ పెట్టాడు...!

  • రూ.1.3 కోట్ల మేర కంపెనీ ఆదాయానికి గండి
  • కంపెనీ త్రైమాసిక ఆడిట్‌లో బయటపడిన మోసం
  • నిందితుడు సహా నలుగురు యువకులు అరెస్ట్..పరారీలో మరో ఇద్దరు
  • నిందితుల నుంచి ఖరీదైన వస్తువులు స్వాధీనం

అతను పదోతరగతి చదువును మధ్యలోనే ఆపేశాడు. కానీ, ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం 'అమేజాన్‌'కే కుచ్చుటోపీ పెట్టాడు. కంపెనీ ఇచ్చిన ట్యాబ్‌తోనే కంపెనీ కొంపముంచాడు. డెబిట్/క్రెడిట్ కార్డుల ట్యాంపరింగ్ ద్వారా ఏకంగా రూ.1.3 కోట్ల మేర తన హస్తలాఘవాన్ని ప్రదర్శించాడు. వివరాల్లోకెళితే...కర్ణాటకలోని చిక్కమంగళూరుకు చెందిన దర్శన్ అలియాస్ ధృవ తన మిత్రులతో కలిసి ఖరీదైన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు. ఎలాంటి నగదు బదిలీలు లేకుండానే వాటిని డెలివరీ చేసుకున్నాడు. సెప్టెంబరు, 2017-ఫిబ్రవరి, 2018 మధ్యకాలంలో నిందితుడు ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. ఆ సమయంలో అమేజాన్‌ కంపెనీకి చిక్కమంగళూరు నగరం నుంచి 4,604 ఆర్డర్లు వచ్చాయి. ఈ ఉత్పత్తులన్నింటినీ ఏకదంత కొరియర్ సర్వీసులో డెలివరీ బాయ్‌గా పనిచేసే దర్శనే బట్వాడా చేశాడు.

కార్డు పేమెంట్ సిస్టమ్‌ను టాంపరింగ్ చేయడం ద్వారా ఇంతపెద్ద మోసానికి దర్శన్ పాల్పడ్డాడని ఎస్‌పీ కే.అన్నామలై మీడియాకి తెలిపారు. కంపెనీ తన త్రైమాసిక ఆడిట్ సమయంలోనే ఈ మోసం గురించి తెలుసుకుందని ఆయన చెప్పారు. దాంతో వారిచ్చిన ఫిర్యాదు మేరకు తాము రంగంలోకి దిగి దర్శన్‌ సహా నలుగురు యువకుల్ని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఆయన వెల్లడించారు. నిందితుల నుంచి రూ.25 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో స్మార్ట్ ఫోన్లు, ఓ ల్యాప్‌టాప్, మరో ఐపాడ్, ఓ యాపిల్ వాచ్‌లు ఉన్నాయి. వాటితో పాటు  నాలుగు బైక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News