షార్జాలో 11 మంది అమ్మాయిల బ్యాచిలర్ పార్టీ... తిరిగి వెళుతుండగా కూలిన బొంబార్డియర్ జెట్... మృతుల్లో టర్కీ ఐకాన్ మీనా బషరన్

12-03-2018 Mon 11:05
  • స్నేహితురాళ్లకు షార్జాలో పార్టీ ఇచ్చిన మీనా బషరన్
  • తిరిగి వెళుతుండగా ఘోర ప్రమాదం
  • విమానంలోని అందరూ మృత్యువాత

షార్జా నుంచి టర్కీకి వెళుతున్న బొంబార్డియర్ టీసీ - టీఆర్బీ జెట్ విమానం, ఇరాన్ లోని జాగ్రోస్ పర్వతాల్లో కుప్పకూలగా, కొద్ది రోజుల్లో పెళ్లి నిశ్చయమైన టర్కీ యూత్ ఐకాన్ మీనా బషరన్ (28) సహా 11 మంది యువతులు దుర్మరణం పాలయ్యారు. బషరన్ బిజినెస్ గ్రూప్ వారసురాలిగా, చిన్న వయసులోనే వ్యాపార రంగంలో రాణించి, టర్కీ యువతలో ఎంతో పేరు తెచ్చుకున్న మీనా బషరన్, తన స్నేహితురాళ్లకు బ్యాచిలర్ పార్టీని ఇచ్చేందుకు షార్జాను ఎంచుకున్నారు.

పార్టీ తరువాత విమానం తిరిగి ఇస్తాంబుల్ కు పయనం కాగా, ఇరాన్ మీదుగా వెళుతున్న వేళ, మంటలు చెలరేగాయి. విమానాన్ని కిందకు దించే ప్రయత్నాల్లో పైలట్ ఉండగానే, మంటలు చెలరేగి, ఓ కొండను విమానం ఢీకొంది. ఈ ఘటనలో పైలట్, విమానంలోని 11 మంది అమ్మాయిలు మృత్యువాత పడ్డారు. విమాన ప్రమాదానికి ముందు మీనా తీయించుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.