Donald Trump: జరిగితే అద్భుతం జరుగుతుంది, లేకుంటే ఏమీ ఉండదు: కిమ్ తో భేటీపై ట్రంప్

  • నిన్న మొన్నటి వరకు యుద్ధనాదం చేసిన కిమ్, ట్రంప్
  • స్నేహగీతం పాడుతున్న కిమ్, ట్రంప్
  • కిమ్ తో భేటీపై ముందుగా ఫలితం ఊహించలేం

నిన్న మొన్నటి వరకు అణ్వాయుధాలతో సర్వనాశనం చేస్తామని హెచ్చరికలు జారీ చేసుకున్న అమెరికా, ఉత్తరకొరియాలు చర్చలకు సముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు దేశాధినేతల మధ్య చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ నేత రిక్ సాకోన్ నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిమ్ జాంగ్ ఉన్ తో జరిగే సమావేశంలో ఎలాంటి ఒప్పందం జరగకపోవచ్చు. లేదా ప్రపంచం మొత్తానికి మేలు జరిగే నిర్ణయం తీసుకోవచ్చు అని పేర్కొన్నారు. కిమ్ తో చర్చల్లో ఇది జరగొచ్చని ముందుగా ఫలితాన్ని ఊహించలేమని ఆయన అన్నారు. అయితే ఆ చర్చలు ఎలాంటి ఫలితాన్నివ్వని పక్షంలో తాను వెంటనే బయల్దేరి వచ్చేస్తానని ఆయన అన్నారు. గత నవంబర్ నుంచి ఉత్తరకొరియా ఎలాంటి అణ్వాయుధ పరీక్షలు నిర్వహించడం లేదని, ఇకపై కూడా వారు ఆ పరీక్షలు నిర్వహించరని ఆశిస్తున్నానని ట్రంప్ తెలిపారు. కాగా, ఆ దేశంపై ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. 

More Telugu News