Sri Lanka: ప్రతీకారం తీర్చుకుంటారా?... నేడే లంకతో పోరు

  • శ్రీలంకతో తలపడనున్న టీమిండియా
  • తొలి మ్యాచ్ లో లంకేయుల చేతిలో ఓటమిపాలైన టీమిండియా
  • బలమైన బ్యాటింగ్ లైనప్ తో టీమిండియా

నిదహాస్‌ ట్రై సిరీస్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఒకదానిని మించి మరోజట్టు రాణిస్తూ, ఆకట్టుకుంటున్నాయి. టోర్నీ ఆరంభమ్యాచ్ లో టైటిల్ ఫేవరేట్ టీమిండియాను శ్రీలంక సులభంగా ఓడించగా, తరువాతి మ్యాచ్ లో బంగ్లదేశ్ ను భారత జట్టు ఓడించి, పాయింట్ల పట్టికలో స్థానం సంపాదించింది. మూడో మ్యాచ్ లో శ్రీలంకను బంగ్లాదేశ్ చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో టోర్నీలో నాలుగో మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక, భారత జట్లు ఆడనున్నాయి. టీమిండియాలో వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్ మంచి జోరుమీదుండగా, శ్రీలంక జట్టులో జీవన్ మెండిస్, కుశాల్ పెరీరా మంచి ఫాంలో ఉన్నారు.

కుశాల్ పెరీరా బౌలర్ ఎవరన్నది చూడకుండా ఎదురుదాడికి దిగుతున్నాడు. దీంతో లంకేయులు భారీ స్కోరు సాధిస్తున్నారు. వీరిద్దరికీ బౌలర్లు ముకుతాడు వేయగలిగితే కానీ టీమిండియా విజయావకాశాలు మెరుగుపడవు. మరోవైపు రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. కెప్టెన్ గా జట్టును నడపాల్సిన రోహిత్ తొందరగా పెవిలియన్ చేరుతుండడంతో భారత జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమవుతోంది. దీంతో తరువాతి బ్యాట్స్ మన్ పై ఒత్తిడి పెరుగుతోంది. తద్వారా బౌలర్లు స్వేచ్ఛగా బంతులు వేయలేకపోతున్నారు. అయినప్పటికీ బ్యాటు తో ధావన్, రైనాలు రాణించి జట్టును మెరుగైన స్థితిలో నిలుపుతున్నారు. ఈ నేపథ్యంలో జట్టు మొత్తం కలిసి కట్టుగా ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. లంకేయులతో బౌలింగ్ లో నిరాశ పరిచిన టీమిండియా బౌలర్లు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో లయదొరకబుచ్చుకున్నారు.

జయదేవ్ ఉనద్కత్ మినహా మిగిలిన వారంతా ఫర్వాలేదనిపించారు. ఈ నేపథ్యంలో బౌలర్లతో పాటు, బ్యాట్స్ మన్ కూడా రాణించాల్సి ఉంది. తొలి టీ20 వేగంగా పరుగులు చేయడంలో తడబడి, ఎక్కువ బంతులాడిన కీపర్ రిషబ్ పంత్ పెవిలియన్ కి పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. కేఎల్ రాహుల్ జట్టులో చోటుకోసం ఎదురు చూస్తున్నాడు. రాహుల్ ను జట్టులోకి తీసుకుంటే రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్ లో వెనక్కి రావచ్చు, అప్పుడు టీమిండియా బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్ఠంగా తయారవుతుంది.

ధావన్, రాహుల్, రైనా, రోహిత్ శర్మ, మనీష్ పాండే, దినేష్ కార్తీక్ లతో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. మరోవైపు స్లోఓవర్ రేట్ కారణంగా శ్రీలంక కెప్టెన్ దినేష్ చండిమాల్ రెండు మ్యాచ్ ల నిషేధానికి గురయ్యాడు. దీంతో తాత్కాలిక కెప్టెన్ తో లంక బరిలో దిగనుంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న మ్యాచ్ లో శ్రీలంకపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? ఒత్తిడితో చతికిల బడుతుందా? అన్న ఆసక్తి రేగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైతే ఫైనల్ లో బెర్తు కోసం బంగ్లాదేశ్ తో పోరాడాల్సి ఉంటుంది. లంకను ఓడిస్తే నేరుగా ఫైనల్ లో ప్రవేశించవచ్చు. ప్రస్తుతం మూడు జట్లు ఒక్కో విజయంతో పాయింట్ల పట్టికలో రెండేసి పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచాయి.

More Telugu News