Neeta Ambani: మా అబ్బాయే మాకు స్ఫూర్తి ప్రదాత : నీతా అంబానీ

  • బరువు తగ్గేందుకు క్లిష్టమైన అహార నియమాలను అనుసరించిన ముకేశ్ తనయుడు
  • రోజూ 23 కిలోమీటర్ల మేర నడకతో 118 కిలోల మేర వెయిట్ లాస్
  • జామ్‌నగర్‌లో 500 రోజుల పాటు కఠోర కోర్సు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ టీమ్ ఆడే మ్యాచ్‌లకు వీఐపీ గ్యాలరీలో ఓ భారీకాయుడు మనకు కనిపిస్తుండేవాడు. ఆయనెవరో ఇప్పటికే మీకు గుర్తొచ్చేసుంటుంది. ఆయనే ఆ ఫ్రాంచైజీ ఓనర్, బిలియనీర్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ. అలాంటి స్థూలకాయుడు ఈ మధ్యకాలంలో చాలా స్లిమ్‌గా తయారై అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కఠోరమైన ఆహార నియమాలతో పాటు రోజూ దాదాపు 23 కిలోమీటర్ల మేర నడవడం ద్వారా 118 కిలోల మేర బరువు తగ్గాడని అతని తల్లి, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా అంబానీ చెప్పారు. అతనే తమకు స్ఫూర్తిప్రదాత అని ఆమె పొగిడేస్తున్నారు.

"2013లో ఐపీఎల్ ట్రోఫీని అందుకునేటప్పుడు అనంత్ తన బరువు వల్ల ఇబ్బంది పడ్డాడు. బరువు తగ్గాలన్న నిర్ణయానికి అదే నాంది పలికింది. జామ్‌నగర్‌లో 500 రోజుల పాటు బస చేసి సహజ పద్ధతుల్లో బరువు తగ్గించుకున్నాడు" అని ఆమె వివరించారు. నిన్న ముంబైలో 'ఇండియా టుడే కాంక్లేవ్'లో ఆమె పాల్గొని ప్రసంగించారు. క్రీడలు, విద్య అనేవి భావితరానికి మూలస్తంభాలని, ఈ రెండింటి వృద్ధికి తమ సంస్థ తన వంతు కృషి చేస్తోందని ఆమె చెప్పారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఓ యూనివర్శిటీని నెలకొల్పే ఆలోచన ఉన్నట్లు ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.

More Telugu News