Hyderabad: ఫేస్ బుక్ వంచన... బ్లాక్ మెయిల్ చేసిన ఘనుల అరెస్టు

  • ఫేస్ బుక్ లో వివాహితకు పరిచయమైన యువకుడు
  • ఛాటింగ్ లో వ్యక్తిగత విషయాలపై చర్చ
  • ఛాటింగ్ ను అడ్డంపెట్టుకుని నగ్న పోటోలు పంపాలని బ్లాక్ మెయిల్

ఫేస్‌ బుక్‌ స్నేహం వివాహితను ఇబ్బందుల్లోకి నెట్టిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... టోలీచౌక్‌ కు చెందిన వ్యక్తి దుబాయి లో సేల్స్‌ మేనేజర్‌ గా పనిచేస్తున్నాడు. హైదరాబాదులో ఉంటున్న అతని భార్యకు జుబేర్ అనే వ్యక్తి ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయం వ్యక్తిగత విషయాలు పంచుకునేంత వరకు వెళ్లింది. దీంతో ఛాటింగ్ లో పలు అభ్యంతరకర విషయాలు కూడా చర్చించుకునేవారు. దీనిని అవకాశంగా తీసుకున్న జుబేర్, నగ్న ఫోటోలు పంపాలని, లేని పక్షంలో తమ మధ్య జరిగిన ఛాటింగ్ సంభాషణలను ఆమె భర్తకు పంపుతానని బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె నగ్నఫోటోలను జుబేర్ కు పంపింది. వాటిని తన ఇద్దరు స్నేహితులకు జుబేర్ షేర్ చేశాడు.

 వారిద్దరూ ఆమెకు పరిచయస్తులు కావడంతో వారు కూడా బ్లాక్ మెయిలింగ్ కు దిగారు. దీంతో ఫేస్ బుక్ అకౌంట్ డిలీట్ చేయాలని నిర్ణయించుకున్న బాధితురాలు, ఆ వివరాలు తనకు తెలియకపోవడంతో సమీర్‌ ఖాన్‌ అనే స్నేహితుడ్ని ఆశ్రయించింది. అకౌంట్ డిలీట్ చేస్తానన్న సమీర్ ఖాన్ ఆమె యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌ తీసుకుని, ఆమె ఛాటింగ్స్, షేర్ చేసిన ఫోటోలను చూసి, ఆమె భర్తకు వాటిని పంపి, తనకు ఒక ల్యాప్ ట్యాప్, పెన్ డ్రైవ్, 5,000 రూపాయల నగదు పంపాలని బ్లాక్ మెయిల్ చేశాడు. భార్య ఛాటింగ్, ఫోటోలు చూసిన భర్త దుబాయ్ నుంచి హైదరాబాదు చేరుకుని, ఆమెను నిలదీశాడు. దీంతో జరిగినదంతా ఆయనకు వివరించడంతో దంపతులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, జుబేర్, అతని ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు. సమీర్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నప్పటికీ, దివ్యాంగుడు కావడం, నడవగలిగే స్థితిలో లేకపోవడంతో రిమాండ్ కు తరలించలేదు.

More Telugu News