Pravind Jugnauth: అర్థాంతరంగా గద్దెదిగనున్న మారిషస్ అధ్యక్షురాలు...'షాపింగ్' ఆరోపణలే కారణమా?

  • ఈ నెల 12 తర్వాత అధ్యక్ష పదవికి ఫకీమ్ రాజీనామా
  • తనపై షాపింగ్ ఆరోపణలే కారణమని సందేహాలు
  • తానే తప్పూ చేయలేదని అధ్యక్షురాలి స్పష్టీకరణ
  • ప్రతి ఒక్కరూ తమ తప్పులకు బాధ్యత వహించాలన్న ప్రధాని

మారిషస్ తొలి మహిళా అధ్యక్షురాలు అమీనా గురీబ్-ఫకీమ్ వచ్చే వారం గద్దె దిగనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని ప్రవీంద్ జుగ్నౌత్ నిన్న వెల్లడించారు. ఈ నెల 12 తర్వాత మారిషస్ 50వ స్వాతంత్ర్య వేడుకలు ముగిసిన తర్వాత ఆమె తన పదవి నుంచి తప్పుకుంటారని ఆయన తెలిపారు. ప్లానెట్ ఎర్త్ ఇన్‌స్టిట్యూట్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ జారీ చేసిన క్రెడిట్ కార్డుతో దుస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారంటూ అధ్యక్షురాలిపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆమె తన పదవి నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇదిలా ఉంటే, అధ్యక్షురాలి క్రెడిట్ కార్డు ఖర్చుల వివరాలను తెలపడానికి ప్రధాని నిరాకరించినప్పటికీ, ప్రతి ఒక్కరూ తమ తప్పులకు బాధ్యత వహించాలని అంతకుముందు మీడియాకి ఆయన స్పష్టం చేశారు. కాగా, కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయిన ఫకీమ్ 2015లో అత్యున్నతమైన మారిషస్ అధ్యక్ష పదవిని అలంకరించారు. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. తానే తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. షాపింగ్ కోసం తాను ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేశానని ఆమె తెలిపారు. కాగా, అధ్యక్షురాలు ఫకీమ్ స్వచ్ఛంద సంస్థ జారీ చేసిన క్రెడిట్ కార్డును ఉపయోగించి ఇటలీ, దుబాయి దేశాల్లో షాపింగ్ చేశారని స్థానిక వార్తాపత్రిక ఎల్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News