Hyderabad: రెడీగా వాటర్ క్యానన్లు, బాష్పవాయు గోళాలు... ఏం జరిగినా ఎదుర్కుంటామంటున్న హైదరాబాద్ పోలీసులు!

  • మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను నిర్వహించి తీరుతామంటున్న టీ జేఏసీ
  • అడ్డుకునేందుకు 12 వేల మంది పోలీసుల మోహరింపు
  • శాంతి భద్రతలకు విఘాతం కలిగించ వద్దని హెచ్చరిక

తెలంగాణ జేఏసీతో పాటు వామపక్షాలు పిలుపునిచ్చిన మిలియన్ మార్క్ స్ఫూర్తి సభను ఎలాగైనా అడ్డుకుని తీరుతామని చెబుతున్న పోలీసులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ ను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ ప్రాంతానికి చేరేందుకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి భారీగా జేఏసీ కార్యకర్తలు, వామపక్ష నేతలు ప్రయత్నిస్తుంటే ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు. మొత్తం 12 వేల మందికి పైగా పోలీసులను రంగంలోకి దించిన అధికారులు రాణీగంజ్, లోయల్ ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, లక్డీకపూల్, నక్లెస్ రోడ్, సంజీవయ్యపార్క్, లిబర్టీ ప్రాంతాల్లో వారిని మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎదుర్కోడానికి వాటర్ క్యానన్లు, బాష్పవాయు గోళాలను, వజ్ర వాహనాలను సిద్ధం చేశామని, అనుమతి లేని సభను నిర్వహించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలనూ ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు. మరోవైపు జేఏసీ నేత కోదండరామ్ ఇంటికి ఒక్కొక్కరుగా నేతలు వస్తుండటంతో ఆ ప్రాంతంలోనూ భారీగా పోలీసులను మోహరించారు. కోదండరామ్ ను ఇప్పటికే ఇంటి నుంచి బయటకు రావద్దని ఆంక్షలు పెట్టిన పోలీసులు, ఆయన కాలు బయటపెడితే అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

More Telugu News