ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుకు భారీ షాక్.. రూ.5 కోట్ల జరిమానా విధించిన ఆర్‌బీఐ

10-03-2018 Sat 08:59
  • కేవైసీ దుర్వినియోగం కేసులో ఎయిర్‌టెల్‌కు భారీ జరిమానా
  • ఖాతాదారులకు తెలియకుండానే ఖాతాలు ఓపెన్ చేసిన ఎయిర్‌టెల్
  • రూ.23 లక్షలకు పైగా ఖాతాల్లోకి రూ.47 కోట్లకు పైగా మళ్లింపు
  • దోషిగా తేల్చి జరిమానా విధించిన రిజర్వు బ్యాంకు
భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) భారీ జరిమానా విధించింది. ఖాతాదారుల కేవైసీలను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుకు రూ.5 కోట్ల జరిమానా విధించింది. ఖాతాదారుల ఇష్టాఇష్టాలతో పనిలేకుండా, వారికి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా వారి పేరున ఖాతాలు సృష్టించినట్టు తేలడంతోనే జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 23 లక్షల మందికిపైగా వినియోగదారుల ఖాతాల్లోకి రూ.47కోట్లకు పైగా సొమ్మును మళ్లించినట్టు ఎయిర్‌టెల్‌పై అభియోగాలున్నాయి. నిజానికి ఆ ఖాతాలు తమ పేరును ఓపెన్ అయినట్టు కూడా వారికి తెలియకపోవడం గమనార్హం. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుపై 1949 నాటి బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం వివిధ సెక్షన్ల కింద ఈ జరిమానాను విధించినట్టు ఆర్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ జోస్ జె.కట్టూర్ పేర్కొన్నారు.