Tankbund: ట్యాంక్ బండ్ అష్టదిగ్బంధం... సర్వత్ర టెన్షన్!

  • నేడు మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ
  • అనుమతి లేదని అడ్డుకుంటున్న పోలీసులు
  • కాసేపట్లో జేఏసీ నేతలతో కోదండరామ్ భేటీ

ప్రత్యేక తెలంగాణ కోరుతూ జరిగిన ఉద్యమంలో 'మిలియన్ మార్చ్' ఎంత సంచలనమో అందరికీ తెలిసిందే. ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న వేళ, వేలాదిగా ట్యాంక్ బండ్ పైకి చేరిన నిరసనకారులు, ట్యాంక్ బండ్ కే తలమానికంగా నిలిచిన మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేశారు. కనిపించిన ప్రతి మీడియా కెమెరానూ హుస్సేన్ సాగర్ లో పడేశారు. ట్యాంక్ బండ్ పై ఉన్న ఏటీఎంలను పగులగొట్టారు. ఆ తరువాత ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంత సెంటిమెంట్ ఉందన్న విషయం బహిర్గతం కాగా, ఆపై రాష్ట్ర విభజన దిశగా చకచకా అడుగులు పడ్డాయి.

ఇక నేడు మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను అదే ట్యాంక్ బండ్ పై నిర్వహించాలని టీజేఏసీ నిర్ణయించగా, అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. నాడు జరిగిన బీభత్సం మరోసారి జరగవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో ట్యాంక్ బండ్ ను పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. సెక్రటేరియేట్ నుంచి ట్యాంక్ బండ్ వైపు ఒక్క వాహనాన్నీ వదలడం లేదు. వాహనాలన్నీ లిబర్టీ చౌరస్తా వైపు మళ్లిస్తున్నారు. ట్యాంక్ బండ్ పై సాయంత్రం 5 గంటల వరకూ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను కర్బాలా మైదానం మీదుగా, అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి వచ్చే వాహనాలను లోయల్ ట్యాంక్ బండ్ మీదుగా మళ్లించారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి ట్యాంక్ బండ్ పైకి వెళ్లేందుకు అక్కడక్కడా ఉన్న మెట్ల మార్గాన్ని ఇనుప కంచెలతో మూసివేశారు. కాగా, మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను ఎలా జరపాలన్న విషయమై జేఏసీ నేత కోదండరామ్ మరికాసేపట్లో వివిధ సంఘాల నేతలతో భేటీ కానున్నారు.

More Telugu News