Pakistan: పాక్ బౌలర్ సంచలనం.. 4 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసిన మరో అఫ్రిది!

  • 22 బంతులు వేసి ఐదు వికెట్లు పడగొట్టిన షహీన్ అఫ్రిది
  • 3.4 ఓవర్లలో 18 బంతులు డాట్ బాల్సే
  • ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ప్రశంసలు

పాక్ క్రికెట్లో మరో అఫ్రిది మెరిశాడు. ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 17 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్ షాహీన్ అఫ్రిది సంచలనం సృష్టించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు నేలకూల్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. శుక్రవారం లాహోర్ ఖలండర్స్-ముల్తాన్ సుల్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. లాహోర్ ఖలండర్స్ తరపున ఆడుతున్న అఫ్రిది 3.4 ఓవర్లు వేసి ఒక మెయిడెన్ తీసుకుని నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు నేల కూల్చాడు. అఫ్రిది దెబ్బకు ముల్తాన్ సుల్తాన్ విలవిల్లాడింది. 114 పరుగులకే కుప్ప కూలింది. అనంతరం బరిలోకి దిగిన లాహోర్ జట్టు 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అఫ్రిదికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఐదు వికెట్లు తీసుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా అఫ్రిది రికార్డు సృష్టించాడు. మెయిడెన్ ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టిన అఫ్రిదిపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అఫ్రిది మొత్తం 22 బంతులు వేయగా అందులో 18 డాట్ బాల్స్ కావడం విశేషం. ఆరడుగుల ఆరంగుళాల పొడవున్న అఫ్రిది బంతిని స్వింగ్ చేయడంలో, యార్కర్లు సంధించడంలో సిద్ధహస్తుడు.

More Telugu News