SP: బాప్‌రే! ఐదేళ్లలో 198 శాతం పెరిగిన సమాజ్‌వాదీ పార్టీ ఆస్తులు.. కోటి నుంచి రూ. 3.7 కోట్లకు పెరిగిన వైసీపీ ఆస్తులు!

  • గణనీయంగా పెరిగిన పార్టీల ఆస్తులు
  • ఫస్ట్ ప్లేస్‌లో సమాజ్‌వాదీ పార్టీ
  • ఆ తర్వాతి స్థానంలో అన్నాడీఎంకే
  • నోటాకు 1.3 కోట్ల ఓట్లు

దేశంలోని రాజకీయ పార్టీల ఆస్తులపై అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్  రీఫామ్స్ (ఏడీఆర్) నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), అన్నాడీఎంకే, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, శివసేన పార్టీల ఆస్తుల్లో గణనీయమైన పురోగతి కనిపించింది. ఏడాదికేడాది ఆయా పార్టీల ఆస్తుల పెరుగుతూ వస్తున్నాయి. 2011-12, 2015-16లో అన్నాడీఎంకే ఆస్తులు 155 శాతం పెరిగాయి. రూ.88 కోట్లు ఉన్న ఆస్తులు ప్రస్తుతం రూ.225 కోట్లకు చేరుకున్నాయి. శివసేన ఆస్తులు 92 శాతం పెరిగి రూ.21 కోట్ల నుంచి రూ.39 కోట్లకు చేరుకున్నాయి. ఎన్నికల సంఘానికి ఆయా పార్టీలు సమర్పించిన ఆస్తులు, ఇతర వివరాలను పరిగణలోకి తీసుకుని ఏడీఆర్ ఈ వివరాలు వెల్లడించింది.

ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ ఆస్తులు ఏకంగా 198 శాతం పెరిగి రూ.213 కోట్ల నుంచి రూ.635 కోట్లుకు చేరుకోవడం గమనార్హం. మార్చి 2011లో జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, నవంబరు 2012లో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు పార్టీల ఆస్తులు కోటి రూపాయలు మాత్రమే కాగా, 2015-16 నాటికి రూ.3.7 కోట్లకు చేరుకున్నాయి.

పార్టీల ఆస్తులతోపాటు 2013లో ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ‘నోటా’కు వచ్చిన ఓట్ల గురించి కూడా ఏడీఆర్ విశ్లేషించింది. చత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నోటాకు అత్యధిక ఓట్లు వచ్చాయి. గత ఐదేళ్లలో లోక్‌సభ, శాసనసభకు జరిగిన ఎన్నికల్లో నోటాకు ఏకంగా 1.3 కోట్ల ఓట్లు వచ్చాయి.  

More Telugu News