Cricket: శ్రీలంక సిరీస్ లో కోహ్లీ, బద్రీనాథ్ ఇద్దరూ ఆడారు... మరి కోహ్లీని నేనెప్పుడు వ్యతిరేకించాను?: శ్రీనివాసన్

  • 2008లో శ్రీలంకతో జరిగిన సిరీస్ లో కోహ్లీ, బద్రీనాథ్ ఇద్దరూ ఆడారు
  • వెంగ్ సర్కార్ ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు
  • జట్టు ఎంపికలో జోక్యం చేసుకునేవాడిని కాదు

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని 2008లో జట్టులోకి తీసుకోవడాన్ని తాను వ్యతిరేకించానన్న మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ చేసిన ఆరోపణలను బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ ఖండించారు. వెంగ్ సర్కార్ ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. తాను జట్టు ఎంపికలో జోక్యం చేసుకునేవాడిని కాదని ఆయన చెప్పారు. వెంగ్ సర్కార్ చెబుతున్న ఇద్దరు ఆటగాళ్లు (కోహ్లీ, బద్రీనాథ్) 2008లో శ్రీలంకతో జరిగిన సిరీస్ లో ఆడారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు వెంగ్ సర్కార్ దీనిపై ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. కోహ్లీ కోసం వెంగ్ సర్కార్ ను ముందుగా తప్పించామని చెప్పడం అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.

 2008లో కొత్త కమిటీలు ఏర్పాటు చేయాల్సిన తరుణంలో బీసీసీఐ సర్వసభ్య సమావేశం జరిగిందని, ఆ సమయంలో వెంగీ ముంబై క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడిగా వెళ్లేందుకు మొగ్గు చూపాడని, దీంతోనే ఆయనను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వెల్లడించారు. వివాదం రేపేందుకే ఆయన ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వెంగీతో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని ఆయన తెలిపారు.

తాను తీసుకున్న చొరవ కారణంగా ప్రోత్సాహకాలు దక్కిన మాజీ క్రికెటర్లలో వెంగ్ సర్కార్ ఒకడని ఆయన పేర్కొన్నారు. క్రికెటర్ గా ఆయనంటే గౌరవం ఉందని, ఆయనను తాము జాతీయ హీరోగా చూశామని శ్రీనివాసన్ చెప్పారు. కాగా, బీసీసీఐ కోశాధికారిగా శ్రీనివాసన్ పదవిలో ఉన్న సమయంలో తమిళనాడు క్రికెటర్ బద్రీనాథ్‌ ను తీసుకోవాలని పట్టుబట్టినా తాను వినకపోవడంతో చీఫ్‌ సెలెక్టర్‌ పదవిని కోల్పోయానని వెంగ్‌ సర్కార్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

More Telugu News