Sonia Gandhi: మన్మోహన్ సింగ్‌ను అందుకే ప్రధానిని చేశా.. సోనియా గాంధీ

  • దేశంలో 2014 తర్వాతే అభివృద్ధి జరిగిందని చెప్పడం ప్రజలను అవమానించడమే
  • ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారు
  • ప్రధాని పదవికి నా కంటే మన్మోహనే బెటరని భావించా
  • ‘ఇండియా టుడే’ సదస్సులో సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత తొలిసారిగా సోనియా గాంధీ పలు విషయాలపై మాట్లాడారు. జాతీయ చానల్ ‘ఇండియా టుడే’ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆమె రాజకీయ, వ్యక్తిగత అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం దేశంలో స్వేచ్ఛగా ఆలోచించడానికి కూడా భయపడాల్సి వస్తోందని అన్నారు. పాలకులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 2014 తర్వాతే దేశంలో అభివృద్ధి జరిగిందని చెప్పడం దేశ ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు. ప్రశ్నించే వారిపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని సోనియా ఆరోపించారు.

ఈ సందర్భంగా 2004లో జరిగిన పరిణామాలను గుర్తుకు తెచ్చుకున్న సోనియా మన్మోహన్‌సింగ్‌ను ఎందుకు ప్రధానిగా ఎన్నుకున్నదీ వివరించారు. ప్రధాని పదవిని చేపట్టే అవకాశం తనకు ఉన్నా తన పరిమితులేంటో తనకు తెలుసునని సోనియా పేర్కొన్నారు. ‘‘నా కంటే మన్మోహన్ ఎంతో సమర్థుడు. ఆర్థికవేత్త కూడా. ప్రధాని పదవికి ఆయన అయితేనే బెటరని భావించా. నా కంటే కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలరని అనుకున్నా. ఈ విషయాన్ని అందరూ అంగీకరించారు. మా అభిప్రాయం తప్పు కాలేదని తర్వాత నిరూపితమైంది’’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు.

More Telugu News