మోదీ ఫోన్ చేసినంత మాత్రాన యూటర్న్ తీసుకోము: ఆదినారాయణరెడ్డి

09-03-2018 Fri 14:42
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం మా పోరాటం ఆగదు
  • జగన్ వి అన్నీ జగన్నాటకాలు
  • రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఓట్లు కూడా మాకే

రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని... వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే బాధతోనే కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చామని చెప్పారు. కేంద్రం ఇప్పటికైనా న్యాయం చేయాలని... లేకపోతే, ఎన్డీయే నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేసినంత మాత్రాన తాము యూటర్న్ తీసుకోబోమని స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ అధినేత జగన్ వి అన్నీ జగన్నాటకాలే అనే విషయం అందరికీ తెలుసని ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీకే ఓటు వేస్తారని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థిని నిలబెట్టే విషయంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.