bcci: క్రికెటర్ల జీతాల పెంపు వివాదం.. బీసీసీఐ-సీవోఏ మధ్య తారస్థాయికి చేరిన విభేదాలు

  • మమ్మల్ని సంప్రదించకుండానే జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నారు
  • ఫైల్ పై సంతకం చేయబోనన్న బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి
  • తనను సమావేశానికి కూడా ఆహ్వానించలేదంటూ మండిపాటు

క్రికెటర్లకు జీతాల పెంపు నిర్ణయం బీసీసీఐ, సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ (సీవోఏ) మధ్య ఇప్పటికే ఉన్న విభేదాలను తారస్థాయికి చేర్చింది. తమను సంప్రదించకుండానే జీతాల పెంపు నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారని బీసీసీఐ పెద్దలు మండిపడుతున్నారు. ఆటగాళ్ల కాంట్రాక్టులకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేయబోనని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి తేల్చి చెప్పారు. జీతాల పెంపుకు సంబంధించిన అంశాల్లో తాను భాగస్వామిని కాదల్చుకోలేదని ఆయన అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సమావేశానికి బీసీసీఐ నుంచి ఒక్క అధికారి కూడా హాజరుకాలేదని... సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అయిన తనను సమావేశానికి కూడా ఆహ్వానించలేదని ఆయన మండిపడ్డారు.

చౌదరి వ్యాఖ్యలపై సీవోఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ స్పందిస్తూ, బీసీసీఐ ఫైనాన్స్ కమిటీకి మూడు సార్లు లేఖలు రాశామని... అయినా, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఆటగాళ్ల ఇన్స్యూరెన్స్ ను త్వరలోనే రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉందని... అందువల్లే కాంట్రాక్టుల ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చామని చెప్పారు. 

More Telugu News