cyber crime: సైబర్ క్రైమ్ బాధితురాలిగా మారిన కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు

  • మలేషియా వెళ్లేందుకు వీసా, టికెట్ వివరాల కోసం గూగుల్ సెర్చ్ చేసిన సుజాతారావు
  • స్క్రీన్ పై ప్రత్యక్షమైన మలేషియా ఆన్‌ లైన్‌ వీసా. ఓఆర్జీ వెబ్‌ సైట్
  • వివరాలు పూర్తి చేయగానే బ్యాంకు నుంచి డబ్బు బదిలీ  

కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డు ఐఏఎస్ అధికారి సుజాతారావు మలేషియా వెళ్లేందుకు టిక్కెట్ కోనే ప్రయత్నంలో సైబర్‌ మోసగాళ్ల చేతిలో మోసపోయారు. దీంతో ఆమె సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... ఫిబ్రవరి 13న మలేషియా వెళ్లేందుకు సుజాతారావు ఆన్ లైన్ లో వీసా, విమాన టిక్కెట్ల వివరాల కోసం గూగుల్‌ లో సెర్చ్ చేశారు. సెర్చ్ చేస్తుండగా మలేషియా ఆన్‌ లైన్‌ వీసా. ఓఆర్జీ వెబ్‌ సైట్ ఒకటి స్క్రీన్ పై ప్రత్యక్షమైంది. దానిని పరిశీలించిన ఆమె పూర్తి వివరాలు నమోదు చేసి, ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని అమౌంట్ పే చేయకుండా మధ్యలోనే విరమించుకున్నారు.

అనంతరం తన బ్యాంక్ అకౌంట్ నుంచి రెండు దఫాలుగా 16,605 రూపాయల చొప్పున మొత్తం 33,210 రూపాయలు ట్రావెల్ ఏజెంట్ ఖాతాలోకి బదిలీ అయినట్టు వచ్చిన మెసేజ్ ను చూసి అవాక్కయ్యారు. వెంటనే ట్రావెల్ ఏజెంట్ ను సంప్రదించి, తన డబ్బులు తనకు వాపస్ చెయ్యాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆ సంస్థ పది రోజుల్లో డబ్బులు వెనక్కి పంపిస్తామని సూచించింది. పదిరోజులు పూర్తయినా డబ్బులు వెనక్కి రాకపోవడంతో ఆమె సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఆ సంస్థపై అనుమానంగా ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఛీటింగ్ కు పాల్పడింది సైబర్ నేరగాళ్లుగా అనుమానిస్తున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. 

More Telugu News