Pakistan: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు షాక్.. అరెస్ట్ చేసి ఆస్తులు సీజ్ చేయాలని కోర్టు ఆదేశం

  • దేశ ద్రోహం కేసును ఎదుర్కొంటున్న ముషారఫ్
  • కీలక తీర్పు వెల్లడించిన ప్రత్యేక న్యాయస్థానం
  • ఆస్తుల సీజ్ వద్దన్న ముషారఫ్ న్యాయవాది
  • తీర్పు వెనక్కి తీసుకోలేమన్న కోర్టు

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ప్రత్యేక న్యాయస్థానం గురువారం షాకిచ్చింది. ముషారఫ్‌ను అరెస్ట్ చేసి ఆయన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. మాజీ అధ్యక్షుడిపై నమోదైన దేశద్రోహం కేసును విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ యెహ్యా అఫ్రిది, లాహోర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ యెవర్ అలీ, బలూచిస్థాన్ హైకోర్టు జస్టిస్ తాహిర సఫ్దర్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

ముషారఫ్‌పై నమోదైన దేశ ద్రోహం కేసును విచారించేందుకు 2013లో ఈ బెంచ్‌ను ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా అంతర్గత మంత్రిత్వ శాఖ ముషారఫ్ ఆస్తులకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించింది. వాదోపవాదాలు విన్న కోర్టు ముషారఫ్‌ను అరెస్ట్ చేసి, ఆయన ఆస్తులను జప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాలపై ముషారఫ్ తరపు న్యాయవాది మాట్లాడుతూ మార్చి 21 వరకు ఆస్తులను జప్తు చేయవద్దని కోరారు. స్పందించిన జస్టిస్ అఫ్రిది మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను మార్చి 21కి వాయిదా వేశారు.

More Telugu News