Yanamala: ఇక మరింత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోక తప్పదేమో: యనమల కీలక వ్యాఖ్య

  • కేంద్రం నుంచి బయటకు వచ్చేశాం
  • మరింత కష్టకాలం తప్పదేమో
  • నిధులు ఇవ్వకుంటే పోరాటమే
  • స్పష్టం చేసిన యనమల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి నవ్యాంధ్రలో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని, ఇప్పుడిక కేంద్రం నుంచి బయటకు వచ్చిన తరువాత మరింత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వకుంటే పోరాడి తెచ్చుకుంటామని చెప్పారు.

ఇచ్చిన హామీలను అమలు చేయనందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డ యనమల, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులను నిలిపివేస్తుందని తాను భావించడం లేదని అన్నారు. ఏపీకి ఇచ్చే సాధారణ నిధులను ఆపితే, అది ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధమవుతుందని, అప్పుడు ప్రజా పోరాటాలు తప్పవని కేంద్రాన్ని యనమల హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో పన్ను వసూళ్లను పటిష్ఠపరిచి, మరిన్ని నిధులను సమీకరించే విషయమై దృష్టిని సారిస్తామని వెల్లడించిన ఆయన, ఇప్పటికీ రెవెన్యూ లోటును కేంద్రం పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదని ఆరోపించారు.

బడ్జెట్ ప్రతిపాదనలపై రెవెన్యూ లోటు ప్రభావం అధికంగానే ఉన్నా, సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని గుర్తు చేసిన ఆయన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆ నిర్ణయం చూపే ప్రభావం ఏంటన్నది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు.

More Telugu News