Prime Minister: నాకు స్ఫూర్తిగా నిలిచిన మహిళ ఆమే: ప్రధాని మోదీ ప్రకటన

  • మేకల్ని అమ్మి మరుగుదొడ్డి నిర్మించుకున్న కున్వర్ భాయ్
  • ప్రతి ఒక్కరి మనసులో ఆమె ఉండిపోతారు
  • ప్రతీ వారూ తమకు స్ఫూర్తినిచ్చిన మహిళ గురించి తెలియజేయాలి
  • మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని స్పందన

ప్రధానమంత్రి నరేంద్రమోదీని 106 ఏళ్ల మహిళ కదిలించారు. ఆమె గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్వయంగా మోదీయే పది మందికి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన సదరు వృద్ధురాలు తనకు స్ఫూర్తినిచ్చారని, అలాగే, ప్రతి ఒక్కరూ తమకు స్ఫూర్తినిచ్చిన మహిళ గురించి తెలియజేయాలని మోదీ సూచించారు.

ఛత్తీస్ గఢ్ కు చెందిన కున్వర్ భాయ్ (106) తన జీవనాధారమైన మేకలను అమ్మేసి మరుగుదొడ్డి నిర్మించేందుకు ఆ డబ్బుల్ని ఖర్చు చేసింది. ఆమె స్వగ్రామంలో తొలి మరుగుదొడ్డి కున్వర్ భాయ్ నిర్మించినదే కావడం విశేషం. అందుకు అయిన ఖర్చు రూ.22,000. స్వచ్ఛభారత్ కు ఆమె అందించిన సేవలు మరచిపోలేనివిగా మోదీ పేర్కొన్నారు. ఆమె గొప్ప చర్య తనను ఎంతో ప్రభావితం చేసిందని తెలిపారు.

ఛత్తీస్ గఢ్ పర్యటనలో కున్వర్ భాయ్ ను కలసి ఆశీర్వచనాలు అందుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. కున్వర్ భాయ్ ఈ ఏడాది మొదట్లో మరణించారు. బాపూజీ స్వచ్ఛ భారత్ కల సాకారం కోసం పాటు పడే ప్రతి ఒక్కరి మనసులో ఆమె జీవించే ఉంటారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

More Telugu News