Jagan: చరిత్ర హీనుడిగా మిగిలి పోకుండా ఉండాలంటే చంద్రబాబు ఈ పని చేయాలి: వైఎస్ జగన్

  • స్వీయ ప్రయోజనాల కోసం పాకులాడే చంద్రబాబు
  • ఇప్పటికైనా చిత్తశుద్ధితో పోరాడితే మేలు
  • చేసిన పాపాలు కడుక్కునేందుకు తప్పును కేంద్రంపై నెడుతున్న బాబు
  • వైఎస్ జగన్ విమర్శనాస్త్రాలు

తన మోసపు మాటలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎప్పటికప్పుడు మభ్యపెడుతూ తన స్వీయ ప్రయోజనాల కోసం పాకులాడే చంద్రబాబునాయుడు, చరిత్ర హీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే, ప్రత్యేక హోదా సాధన దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సలహా ఇచ్చారు. గతంలో తాను చెప్పినట్టుగానే కలసికట్టుగా పోరాడితే హోదా సాధ్యమేనని, ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరిచి, ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని గుర్తించాలని కోరారు. అన్యాయాలకైనా, మోసానికైనా ఓ హద్దు ఉండాలని, స్వాతంత్ర్య పోరాటం చివరి దశకు వచ్చిన సమయంలో ఇండియాకు స్వాతంత్ర్యం కోసం తామే పోరాడామని బ్రిటీష్ వారు చెప్పుకున్నట్టుగా చంద్రబాబు వైఖరి ఉందని జగన్ దుయ్యబట్టారు.

 తాను చేసిన పాపాలను కడుక్కునేందుకు తప్పంతా కేంద్రానిదేనన్నట్టు ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. తనకున్న బలంతో తాను చేయగలిగినది అంతా చేస్తానని, అంతకుమించి చేయడానికి ఇతర పార్టీల మద్దతు అవసరమని, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో అవిశ్వాసంపై చర్చిస్తున్నామని జగన్ తెలియజేశారు. తమ పార్టీ పారదర్శకంగా పోరాడుతోందని, అదే పనిని చంద్రబాబు కూడా చేయాలని సూచించారు.

ఆనాడు తాను హోదా కోసం 8 రోజుల పాటు గుంటూరులో నిరాహారదీక్ష చేస్తుంటే, నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారన్న కారణంగా రాత్రి పూట తనను బలవంతంగా దీక్షా శిబిరం నుంచి తీసుకెళ్లిపోయారని, బుద్ధున్న వాళ్లు చేసే పని ఇలాగే ఉంటుందా? అని ప్రశ్నించారు. ఓ ప్రతిపక్ష నేతగా తాను దీక్షకు దిగితే, మోదీకి తనను చూపి, ప్రజల్లో బలంగా ఉన్న హోదా ఆకాంక్షను గురించి చెప్పకుండా నాడు చంద్రబాబు ప్రజలను మోసం చేశారని జగన్ ఆరోపించారు. తాము ఆర్టీసీ బంద్ కు పిలుపునిస్తే, బంద్ ను నిర్వీర్యం చేసేందుకు బస్సులను బలవంతంగా తిప్పించారని ఆరోపించారు. యువభేరీకి వచ్చిన విద్యార్థులపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టిస్తానని బెదిరించారని, ఈ పాపాలన్నీ ఒక్క మాటతో కడుక్కునే పరిస్థితి లేదని అన్నారు. 

More Telugu News