black magic: గత జన్మలో మైసూర్ మహరాజువంటూ 5 కోట్లు దండుకున్న మంత్రగాడు

  • సులువుగా డబ్బు సంపాదించేందుకు మంత్రగాడిని ఆశ్రయించిన రుస్తుం పటేల్
  • రైస్ పులింగ్ పాత్ర, గుప్త నిధులు, గత జన్మ పేరుతో 5 కోట్లు దండుకున్న మంత్రగాడు
  • మంత్రగాడికి సహకరించిన భార్య

మంత్రతంత్రాలతో సులువుగా డబ్బు సంపాదించొచ్చని భావించిన వ్యాపారిని 5 కోట్లకు ముంచిన ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... కర్ణాటకలోని బీదర్‌ జల్‌ సంగీకి చెందిన రుస్తుం పటేల్‌ (42) హైదరాబాదులోని పాతబస్తీలోని యాఖుత్‌ పురా దారాబ్‌ జంగ్‌ కాలనీ లో నివాసముంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. అంతకుముందు ఆయన చిన్నగోల్కొండలో నివాసం వుండేవారు. ఆ సమయంలో బీదర్‌ కు చెందిన మిత్రుడు ఆజం ద్వారా రాజేంద్రనగర్‌ చింతల్‌ లోని గోల్డెన్‌ కాలనీకి చెందిన బాణామతి చేసే మెహతాబ్‌ హుస్సేన్‌ (40) అలియాస్‌ ఆదిల్‌ పరిచయమయ్యాడు.

ఆదిల్ మాటలను రుస్తుం పటేల్‌ విశ్వసించేవాడు. దీనిని ఆసరాగా తీసుకున్న ఆదిల్‌, రుస్తుం పటేల్ ను మోసగించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతనికి రైస్‌ పుల్లింగ్ మంత్ర పాత్ర ఉందని, దానిలో ఒక భాగం అంతర్జాతీయ మార్కెట్‌ లో 2500 కోట్ల రూపాయల విలువ చేస్తుందని నమ్మించాడు. బీదర్ సమీపంలోని జలసంగీ ప్రాంతంలో తవ్వకాలు చేస్తే బంగారు గనులు దక్కుతాయని ఆశపెట్టాడు. ఇలా రుస్తుం పటేల్ నుంచి ఆదిల్ సుమారు 5 కోట్ల రూపాయలు దండుకున్నాడు.

ఆ తరువాత మరో పథకం ప్రకారం...పూర్వజన్మలో నువ్వు మైసూర్‌ మహారాజువని, నీ కనుసైగతో రాజ్యం నడిచేదని నమ్మబలికాడు. అప్పటి రాజకన్య ఇప్పుడు మళ్లీ పుట్టిందని, ఆమె పేరిట కోట్ల విలువైన ఆస్తులున్నాయని, వాటిని దక్కేటట్టు చేస్తానని చెప్పాడు. ఆ తరువాత ఒక యువతి ఫోటోలు, ఆమె రాసిందంటూ లేఖలు చూపించాడు.

దీంతో అనుమానం వచ్చిన రుస్తుం పటేల్... ఆదిల్ తనను మోసం చేస్తున్నాడని గుర్తించాడు. దీంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని ఆదిల్ ని హెచ్చరించాడు. దీంతో ఎదురు తిరిగిన ఆదిల్ తుపాకీతో బెదిరించాడు. అనంతరం ఆదిల్ మల్లేపల్లికి చెందిన రౌడీషీటర్‌ మహ్మద్‌ యూసఫ్‌ (44) అలియాస్‌ జంగ్లీయూసఫ్‌ కు ను ఆశ్రయించాడు. వ్యాపారి తన జోలికి రాకుండా చేయాలని కోరాడు.

అందుకు ప్రతిగా యూసఫ్ డిమాండ్ చేసిన 8.5 లక్షల రూపాయలు చెల్లించాడు. దీంతో రౌడీషీటర్‌ రుస్తుం పటేల్ ను బెదిరించాడు. భయాందోళనలకు గురైన బాధితుడు మీర్‌ చౌక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా, మంత్రగాడికి అతడి మూడో భార్య సకీనా ఫాతిమా సహకరించినట్టు గుర్తించారు. దీంతో సకీనా, ఆదిల్, యూసఫ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 13.50 లక్షల నగదు, బ్లాక్‌ మ్యాజిక్‌ కు ఉపయోగించే సామగ్రి, ఎయిర్‌ పిస్టల్‌ ను స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News