Sasikala: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై మాజీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు

  • జైల్లోని శశికళకు వీవీఐపీ ట్రీట్‌మెంట్ కల్పించమని ఆదేశించారన్న మాజీ డీజీపీ
  • ‘బేస్ లెస్’ అంటూ కొట్టిపడేసిన సిద్ధరామయ్య
  • వైద్యుల సూచన మేరకే కల్పించామన్న హోంమంత్రి

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై జైళ్ల శాఖ మాజీ డీజీపీ హెచ్ఎన్ఆర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నేత శశికళకు జైలులో వీవీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని వ్యాఖ్యానించి కలకలం రేపారు. జైల్లో ఉన్న శశికళకు మంచం, బెడ్, తలగడ తదితర సౌకర్యాలు సమకూర్చాలని సిద్ధరామయ్య ఆదేశించారని పేర్కొన్నారు.

హెచ్ఎన్ఆర్ రావు ఆరోపణలపై కలకలం రేగడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. రావు వ్యాఖ్యలను ఖండించారు. శశికళకు సకల సౌకర్యాలు సమకూర్చాలని తానెప్పుడూ అధికారులను ఆదేశించలేదని తేల్చి చెప్పారు. శశికళను పరామర్శించేందుకు వచ్చిన ఓ ప్రతినిధి బృందం శశికళకు కనీస సౌకర్యాలు కూడా అందించడం లేదని ఫిర్యాదు చేసిందని, దీంతో ప్రిజన్ మాన్యువల్ ప్రకారం అందాల్సిన సౌకర్యాలను అందించాలని మాత్రమే తాను ఆదేశించినట్టు చెప్పారు. జైళ్ల శాఖపై వస్తున్న ఆరోపణలపై విచారణకు ఆదేశించడంతోనే రావు తనపై ఈ ఆరోపణలు చేశారని సీఎం పేర్కొన్నారు. ఆయన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపడేశారు.

కాగా, హోంమంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ వైద్యుల ఆదేశాల ప్రకారమే శశికళకు ఆ సౌకర్యాలు కల్పించినట్టు చెప్పారు.

More Telugu News