apple i phone: చిన్నారి 'ఆట'తో లాక్ అయిన ఐ ఫోన్.. అన్ లాక్ అవడానికి 48 ఏళ్లు ఆగాలట!

  • ఐ ఫోన్ ని లాక్ చేసి ఆడుకునేందుకు రెండేళ్ల కొడుక్కిచ్చిన లూ
  • ఆడుకునే ప్రయత్నంలో పలు మార్లు ఫోన్ లాక్ ను అటెంప్ట్ చేసిన చిన్నారి
  • 25 మిలియన్ నిమిషాల తరువాత అన్ లాక్ చేయాలంటూ ప్రత్యక్షమైన మెసేజీ

చిన్న పొరపాటుతో లాక్ అయిన ఐఫోన్ తెరుచుకునేందుకు 48 ఏళ్లు పడుతుందని యాపిల్ స్టోర్ సిబ్బంది చెప్పడంతో ఓ మహిళ అవాక్కైంది. దాని వివరాల్లోకి వెళ్తే... చైనాలోని షాంఘైకి చెందిన లూ అనే మహిళ ఐఫోన్‌ వినియోగిస్తోంది. అల్లరి చేస్తున్న తన రెండేళ్ల కొడుకుకి ఆడుకునేందుకు తన ఐఫోన్ లాక్ చేసి ఇచ్చింది. తన పని ముగిసిన తరువాత పిల్లాడిని ఆడించేందుకు తీసుకుంటూ తన ఫోన్ చూసుకుంది.

అప్పటికి ఫోన్ స్క్రీన్ పై 25 మిలియన్‌ నిమిషాల (48 ఏళ్ల) తరువాత అన్ లాక్ చేయాలంటూ సందేశం వచ్చింది. దీంతో బిత్తరపోయిన ఆమె పరుగున యాపిల్ స్టోర్ కు వెళ్లింది. అన్ లాక్ చేసే ప్రయత్నం చేస్తే ఆ మెసేజీ చూపిస్తోందని, తన ఫోన్ ను అన్ లాక్ చేయాలని స్టోర్ సిబ్బందిని కోరింది. దీంతో ఫోన్ ను పరీక్షించిన సిబ్బంది, ఫోన్ ను రీ బూట్ చేయాలని చెప్పారు.

అలా చేస్తే ఫోన్ లో ఉన్న తన డేటా, కాంటాక్ట్స్, ఫైల్స్ మొత్తం పోతాయని, తన ఫోన్‌ లో విలువైన సమాచారం ఉందని, అది పోకుండా అన్ లాక్ చేయాలని ఆమె కోరింది. 'అయితే 48 ఏళ్లు ఎదురు చూడండి, ఫోన్ తెరుచుకుంటుంది, అప్పుడు వినియోగించొచ్చు' అంటూ యాపిల్ స్టోర్ సిబ్బంది సమాధానమివ్వడంతో ఆ మహిళ బిత్తరపోయింది. ఫోన్‌ అన్‌ లాక్‌ అవ్వాలంటే ఫ్యాక్టరీ రీసెట్‌ చేయాల్సి ఉంటుందని, అలా చేయాలంటే ఫోన్ ను రీ బూట్ చేయాల్సిందేనని, లేని పక్షంలో 48 ఏళ్లు వేచి చూడడమే మార్గమని వారు వివరించారు. 

More Telugu News