Chittoor District: పరిణతిలేని ప్రేమతో మైనర్ల తప్పుటడుగు... కోర్టును ఆశ్రయించిన చిత్తూరు పోలీసులు!

  • చిత్తూరు జిల్లాలో ఘటన
  • 16 ఏళ్ల అబ్బాయితో 17 ఏళ్ల అమ్మాయి ప్రేమ
  • సహజీవనం తరువాత పెళ్లికి నిరాకరించిన అబ్బాయి
  • మైనర్లు కావడంతో కేసు నమోదు విషయమై కోర్టును ఆశ్రయించిన పోలీసులు

17 సంవత్సరాల అమ్మాయి, 16 సంవత్సరాల అబ్బాయి మధ్య పుట్టిన ప్రేమ ఇప్పుడు చిత్తూరు జిల్లా పోలీసులకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. ఇద్దరూ మైనర్లే కావడంతో, తమ ముందుకు వచ్చిన ఫిర్యాదుపై కేసు పెట్టాలా? వద్దా? అన్న విషయంలో న్యాయ సలహా కోరుతూ సత్యవేడు కోర్టును ఆశ్రయించారు వరదయ్యపాళెం పోలీసులు. న్యాయ స్థానానికి పరీక్షను పెట్టిన ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, బీఎన్‌ కండ్రిగ సమీపంలోని గాజులపెళ్లూరుకు చెందిన ఓ కుటుంబం వరదయ్యపాళెం మండలానికి బతుకుదెరువు కోసం వచ్చింది.

వారి పెద్ద కుమార్తెకు వివాహమై తమిళనాడులోని అత్తింట ఉండగా, ఆమెకు కాన్పు సమయంలో సహాయకారిగా ఉండేందుకు రెండో కుమార్తె (17)ను ఆమె దగ్గరకు పంపారు. ఆ సమయంలో సమీపంలో నివాసముండే 16 ఏళ్ల అబ్బాయితో స్నేహం ప్రారంభించిన అమ్మాయి, ఆపై ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్న ఇద్దరూ శారీరకంగా కూడా కలిశారు.

 రెండు కుటుంబాల్లో విషయం తెలియగా, ఆ బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరింది. అతను కూడా ఆమె కావాలంటూ చిత్తూరు జిల్లాకు రాగా, బాలిక తల్లిదండ్రులు ఆదరించారు. పెళ్లి చేసుకుంటానని చెబుతూ, కొన్ని నెలల పాటు సహజీవనం సాగించాడు కూడా. వీరిద్దరికీ పెళ్లి చేయాలని రెండు కుటుంబాలూ నిర్ణయించుకున్న వేళ, బాలుడు ఈ వివాహం తనకు వద్దంటూ మాట మార్చాడు.

దీంతో తాను మోసపోయానన్న మనస్తాపంతో బాలిక గత నెలలో ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రి పాలైంది. ఆమె కోలుకున్న తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయగా, వీరిద్దరూ మైనర్లే కావడంతో కేసు నమోదు చేసేందుకు ఆలోచించిన పోలీసులు తొలుత కౌన్సెలింగ్ ఇచ్చి చూశారు. ఆపై బాధితురాలి ఫిర్యాదును నమోదు చేసుకునేందుకు అనుమతించాలంటూ, సత్యవేడు కోర్టును ఆశ్రయించారు.

More Telugu News