కూలిన రష్యా విమానం... 32 మంది మృతి

07-03-2018 Wed 09:27
  • సిరియాలోని హిమిమిమ్ ఎయిర్ బేస్ లో ప్రమాదం
  • రన్ వేకు 500 మీటర్ల దూరంలో మండిపోయిన విమానం
  • ఆరుగురు సిబ్బంది, 26 మంది ప్రయాణికుల దుర్మరణం
సిరియాలోని హిమిమిమ్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అవుతున్న రష్యా రవాణా విమానం సాంకేతిక లోపం కారణంగా కూలిపోవడంతో 32 మంది మరణించారు. రష్యా రక్షణ శాఖ అధికారి ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం, సిరియాలోని రష్యా సైనికుల అవసరాలను తీర్చేందుకు ఈ విమానాన్ని వాడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 26 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరంతా మరణించారని తెలిపారు. విమానాన్ని ల్యాండ్ చేసే ప్రయత్నంలో పైలట్లు ఉన్నవేళ మంటల్లో చిక్కుకుందని తెలుస్తుండగా, రన్ వేకు కేవలం 500 మీటర్ల దూరంలో విమానం కూలిపోయింది.

కాగా, జరిగిన ప్రమాదంపై అధికారుల విచారణ మొదలైంది. ఈ ఘటన వెనుక విమానయాన రక్షణ నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? అన్న కోణంతో పాటు, ల్యాండింగ్ సమయంలో తేలికపాటి క్షిపణి ప్రయోగం జరిగిందా? అన్న కోణంలోనూ విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, గత డిసెంబర్ లో ఈ ఎయిర్ బేస్ ను, ఇక్కడున్న రష్యా సైనిక స్థావరాన్ని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సందర్శించిన సంగతి తెలిసిందే.