Passport: బ్యాంకు రుణం రూ.50 కోట్లు దాటితే...ఇవి తప్పనిసరిగా ఇవ్వాల్సిందే

  • భారీ రుణగ్రహీతల నుంచి పాస్ పోర్టు వివరాల సేకరణ
  • రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోకుండా చేయవచ్చని భావన
  • ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును తీసుకువచ్చేందుకు కసరత్తులు

ఇటీవల కాలంలో బడా బడా పారిశ్రామికవేత్తలు తమ మోసపూరిత తెలివితేటలతో బ్యాంకులను ముంచుతున్న నేపథ్యంలో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలను తీసుకురాబోతోంది. బ్యాంకుల నుంచి రూ.50 కోట్లకు పైగా రుణాలు పొందే వారి పాస్ పోర్టు వివరాలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించనుంది. రుణగ్రహీతలు భారీ మొత్తాల్లో రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు దోహదపడగలవని ఆ శాఖ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

"బ్యాంకులు, నిఘా సంస్థలు, ఇతర ప్రభుత్వ విభాగాల మధ్య మరింత సమన్వయం కోసం మేం ప్రయత్నిస్తున్నాం. లావాదేవీల పరంగా ఏదైనా ఖాతాపై అనుమానమొస్తే బ్యాంకులు ముందుగానే సంబంధిత ఏజెన్సీలకు తెలపవచ్చు" అని ఆయన తెలిపారు. వివిధ విభాగాలు సమాచారాన్ని ముందుగానే పంచుకోవడం వల్ల మోసగాళ్లు దేశం విడిచి పారిపోకుండా చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యా, కొద్ది రోజుల కిందట ఢిల్లీ వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీలు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు కొత్త నిబంధనలు తీసుకొస్తుండటం గమనార్హం.

More Telugu News