google tez app: వాట్సాప్, పేటీఎంలకు గూగుల్ సవాల్... తేజ్ యాప్ లో చాట్ ఆప్షన్

  • డిజిటల్ చెల్లింపులతోపాటు చాటింగ్
  • అతి త్వరలోనే కొత్త వెర్షన్ తో అందుబాటులోకి
  • వాట్సాప్ నుంచి కూడా ఇటీవలే చెల్లింపుల సేవలు
  • దీంతో గూగుల్ పోటీ చర్య

యూపీఐతో డిజిటల్ చెల్లింపులను సులభంగా కానిచ్చేందుకు సాయపడే గూగుల్ తేజ్ యాప్ మరో కొత్త శక్తిని సంతరించుకుంది. తేజ్ లో ఇకపై చాట్ కూడా చేసుకోవచ్చు. అయితే, ఇది ప్రారంభ దశలోనే ఉంది. యూజర్లు అందరికీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. నగదును తమ బ్యాంకు ఖాతా నుంచి ఇతరుల బ్యాంకు ఖాతాలకు పంపుకోవడంతోపాటు తమ కాంటాక్టుల్లో ఉన్న వారితో చాట్ కూడా చేసుకోవచ్చు.

తేజ్ యాప్ లో చాట్ ఆప్షన్ ను ప్రవేశపెట్టిన విషయాన్ని గూగుల్ అధికార ప్రతినిధి సైతం ధ్రువీకరించారు. తేజ్ యాప్ లో చెల్లింపులకు సంబంధించి సులభమైన సందేశాలు పంపుకునే సదుపాయాన్ని చేర్చామంటూ ఓ పత్రికకు సమాచారమిచ్చారు. పే, రిక్వెస్ట్ బటన్ల తర్వాత చాట్ ఆప్షన్ ఉంటుంది. తేజ్ తాజా వెర్షన్ లో ఈ చాట్ సదుపాయం అతి త్వరలోనే రానుంది. పేటీఎం ఎప్పటి నుంచో డిజిటల్ చెల్లింపుల్లో ఉండగా, తేజ్ రాకతో పేటీఎం సైతం యూపీఐ లావాదేవీలను ఆరంభించింది. అతిపెద్ద సందేశాల వేదిక వాట్సాప్ కూడా ఇటీవలే చెల్లింపుల సేవలను ఆరంభించిన విషయం తెలిసిందే. దీంతో తేజ్ కూడా వీటితో వెనుకబడకుండా చాట్ ఆప్షన్ తీసుకొచ్చింది. 

More Telugu News