Taliban: శాంతి..శాంతి! ఆఫ్ఘనిస్థాన్‌తో శాంతి చర్చలకు తాలిబన్ ఉగ్రవాదులు రెడీ!

  • ఒకే ఒక్క షరతుతో చర్చలకు ముందుకొచ్చిన తాలిబన్లు
  • టీఏపీఐ ప్రాజెక్టులో ఉద్యోగాలు కోరుతున్న ఉగ్రవాదులు
  • సిద్ధమన్న ఘనీ ప్రభుత్వం.. స్వాగతించిన పాకిస్థాన్

ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో శాంతి చర్చలకు తాలిబన్లు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్‌లోని హెరాత్ ప్రావిన్షియల్ కౌన్సిల్ చైర్మన్ కమ్రాన్ అలీజై నిర్ధారించారు. ఉగ్రవాద సంస్థతో శాంతి చర్చలు జరగనున్నట్టు చెప్పారు. అయితే ఇందుకోసం తాలిబన్లు కొన్ని ముందస్తు ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు. తుర్కెమెనిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్-ఇండియా (టీఏపీఐ) గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టులో ఉద్యోగాలు కల్పించాలనే నిబంధన విధించినట్టు తెలిపారు.

శాంతి చర్చలపై తాలిబన్ సంస్థ మాట్లాడుతూ టీఏపీఐ ప్రాజెక్టులో ఉద్యోగాలు కల్పిస్తే శాంతి చర్చలకు తాము సిద్ధమని ప్రకటించింది. అంతేకాదు.. అలా జరిగితే ప్రాజెక్టు రక్షణ బాధ్యతలను తాము చూసుకుంటామని పేర్కొంది. ఉగ్రవాద సంస్థ నిర్ణయాన్ని హెరాత్ గవర్నర్ మొహమ్మద్ అసిఫ్ రహీమీ స్వాగతించారు. శాంతి చర్చల్లో పాల్గొంటే వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వ వ్యతిరేక శక్తులందరికీ తలుపులు తెరిచే ఉన్నాయి. ఉద్యోగావకాశాలు అందరికీ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని రహీమీ పేర్కొన్నారు. తాలిబన్లతో చర్చలు జరపాలన్న ఘనీ నిర్ణయాన్ని పాకిస్థాన్ స్వాగతించింది.

More Telugu News