Rajinikanth: ఆ లోటును నేను భర్తీ చేస్తాను.. అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను: రజనీకాంత్‌

  • నాకిప్పుడు 67 ఏళ్లు
  • రాజకీయ నేతలు తమ పని సరిగ్గా చేయడం లేదు 
  • అందుకే రాజకీయాల్లోకి వస్తున్నాను
  • ప్రస్తుతం తమిళనాడులో సరైన నాయకుడు ఎవరూ లేరు.. ఆ లోటు భర్తీ చేస్తా

రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన సినీన‌టుడు ర‌జ‌నీకాంత్.. తాను పెట్ట‌నున్న కొత్త పార్టీ కోసం ఇప్ప‌టికే స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఆయ‌న చెన్నైలోని వెలప్పన్వాడీలోని డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఎంజీ రామచంద్రన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయడం లేదని అన్నారు.

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ నేతలతో పాటు కొందరు రాజకీయ నేతలు తనను పదే పదే ఓ విషయం అడుగుతున్నారని, సినిమా నటులు మేకప్ తీసేసి రాజకీయాల్లోకి రావడం ఎందుకని అంటున్నారని, తనకు ఇప్పుడు 67 ఏళ్ల వయసని, రాజకీయ నేతలు తమ పని సరిగ్గా చేయడం లేదు కాబట్టే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో సరైన నాయకుడు ఎవరూ లేరని, ఆ లోటును తాను భర్తీ చేస్తానని అన్నారు. ఆ దేవుడు తన వైపే ఉన్నాడని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే పారదర్శకమైన పాలన అందిస్తామని తెలిపారు. రాజకీయాలు అంటే అంత ఈజీ కాదని తనకు తెలుసని అన్నారు. 

More Telugu News