goa cm: గోవా ముఖ్యమంత్రికి కుదుటపడని ఆరోగ్యం... వైద్యుల సూచనతో అవసరమైతే విదేశాలకు

  • మరిన్ని వైద్య పరీక్షల కోసం ముంబైకి
  • వైద్యుల సూచిస్తే మెరుగైన చికిత్స కోసం విదేశానికి ప్రయాణం
  • వెల్లడించిన సీఎం పర్సనల్ సెక్రటరీ
  • గత నెల 15 నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పారికర్

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. ఆయన గత కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆ అస్వస్థత ఏంటన్నది ఇతమిద్ధంగా బయటకు వెల్లడించకుండా గోప్యత పాటిస్తుండడంతో సందేహాలకు అవకాశమిస్తోంది. 62 ఏళ్ల ఈ బీజేపీ నేత ఫిిబ్రవరి 25న గోవా మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో డీ హైడ్రేషన్, తక్కువ బ్లడ్ ప్రషర్ తో ఉన్నట్టు సమాచారం బయటకు విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని సీఎం కార్యాలయం ప్రకటించింది కూడా. అంతకుముందే ఆయన గత నెల 15న ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో పాక్షిక పక్షవాతంతో చేరారు. 22న డిశ్చార్జ్ అయ్యారు. తిరిగి మూడు రోజుల్లోనే ఆస్పత్రిలో చేరడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారేమోనన్న సందేహాలు తలెత్తాయి.

అయితే, గోవా ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి రూపేష్ కామత్ వెల్లడించిన తాజా సమాచారం మేరకు మనోహర్ పారికర్ మరిన్ని వైద్య పరీక్షల కోసం మరోసారి ముంబై వెళ్లనున్నారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అవసరమైతే తదుపరి చికిత్స కోసం విదేశాలకు వెళతారు. ఆయన చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి.

More Telugu News