Chandrababu: మంచిగా నిద్ర పట్టాలంటే ఈ విధంగా చేయండి!: చంద్రబాబు సలహా

  • రోజూ కాసేపైనా బయట తిరగాలి
  • ఉత్సాహంగా గడిపేందుకే 'హ్యాపీ సండే'
  • బయటకొచ్చి అరిస్తే మంచి నిద్ర
  • రేపటి నుంచి 'పలకరింపు' కార్యక్రమం
  • ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

ఎప్పుడూ ఇంట్లోనే ఉండకుండా రోజులో కాసేపు బయట తిరగాలని, ఆ సమయంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని తన నివాసంలో 'పలకరింపు' పోస్టర్ ను ఆవిష్కరించిన ఆయన, ప్రతి ఒక్కరూ కాసేపైనా ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతోనే 'హ్యాపీ సండే' కార్యక్రమానికి రూపకల్పన చేశానని, రోడ్లపై డ్యాన్సులు చేస్తుంటే చూసి ఆనందించవచ్చని అన్నారు.

ఇంట్లోంచి బయటకు వచ్చి కాసేపు గట్టిగా అరచి ఆపై ఇంటికి వెళితే, ఉత్సాహంగా ఉంటుందని, రాత్రి పూట మంచిగా నిద్ర పడుతుందని చెప్పారు. ప్రభుత్వం ఎన్నో ఆరోగ్య కార్యక్రమాలను చేపట్టిందని, ప్రస్తుతం ఆరోగ్యంలో దేశంలో 8వ స్థానంలో ఉన్న రాష్ట్రం మరింత పైకి రావాల్సి వుందని అన్నారు. షుగర్, ఆస్తమా, ఆర్థరైటిస్, ఒత్తిడి తదితర వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

చాలా మంది టాయిలెట్ లేకున్నా ఫర్వాలేదుగానీ, సెల్ ఫోన్ కావాలని కోరుకుంటున్నారని, ఈ విధమైన ఆలోచనా దృక్పథం మారాలని చంద్రబాబు కోరారు. బంగారం, వజ్రాలను ధరిస్తే ఆనందం రాదని, ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉన్నట్టేనని అభిప్రాయపడ్డారు. ఇకపై అనారోగ్య సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ, ప్రతి నెలా ఓ హెల్త్ బులెటిన్ ను ఇస్తామని తెలిపారు. నేటి నుంచి 30వ తేదీ వరకూ 'పలకరింపు' ద్వారా ఐదేళ్లలోపు పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం చేపట్టనున్నామని, మొత్తం 57 వేల మంది వైద్య సిబ్బంది 1.22 కోట్ల గృహాలకు వెళ్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు.

More Telugu News