India: కొనేవారేరి?... దేశ వ్యాప్తంగా యజమానుల కోసం ఎదురుచూస్తున్న 4.4 లక్షల ఇళ్లు!

  • హైదరాబాద్ లో ఖాళీగా 28 వేల యూనిట్లు
  • ముంబైలో 86 వేల యూనిట్లు ఖాళీ
  • ఢిల్లీలో అత్యధికంగా 1.50 లక్షల గృహాలు ఖాళీ

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గత సంవత్సరం ఆఖరి వరకూ 4.4 లక్షల గృహాలు అమ్ముడుపోకుండా ఉండిపోయాయి. జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావం వల్లనే నిర్మాణరంగం కుదేలైందని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థలు అంచనా వేశాయి. ఒక్క దేశరాజధానిలోని ఎన్సీఆర్ ప్రాంతంలోనే 1.50 లక్షలకు పైగా ఫ్లాట్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నా, వాటిని కొనుగోలు చేసే వారు లేరని నిర్మాణ రంగంలో సేవలను అందిస్తున్న జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది. అధిక సంఖ్యలో ఫ్లాట్లు కొనుగోలు దారులు లేక ఖాళీగా పడి ఉండటంతో ధరలు స్థిరంగా ఉన్నాయని జేఎల్ఎల్ తెలిపింది. సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలను వెల్లడిస్తూ, ఢిల్లీ, చెన్నై, పుణె, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్ నగరాల్లో ఖాళీ నివాస గృహాల సంఖ్య పెరుగుతోందని తెలిపింది.

చెన్నైలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని, నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్లాట్లను సైతం సొంతం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొందని తెలిపింది. కోల్ కతాలో 26 వేల యూనిట్లు మిగిలిపోగా, హైదరాబాద్ లో 28 వేల యూనిట్లు, పుణెలో 36 వేల యూనిట్లు ముంబైలో 86 వేల యూనిట్లు, బెంగళూరులో 70 వేల యూనిట్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఈ సంవత్సరం రెండో అర్ధ భాగం నుంచి వీటి కొనుగోలుకు ప్రజలు ప్రయత్నించవచ్చని, అప్పుడు ధరలు క్రమంగా పుంజుకునే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.

More Telugu News