Jharkhand High Court: ఆరేళ్ల బాలుడికి అరుదైన వ్యాధి.. కోట్లు ఖర్చయినా భరించాలంటూ ప్రభుత్వాలకు కోర్టు ఆదేశం..!

  • 'హంటింగ్టన్ సిండ్రోమ్' రోగంతో బాధపడుతున్న బాలుడు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త బాధ్యత తీసుకోవాలన్న కోర్టు
  • కార్పస్ ఫండ్ నుంచి నిధులు విడుదల చేయాలని తీర్పు

'హంటింగ్టన్ సిండ్రోమ్' అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఆరేళ్ల బాలుడికి అవసరమైన మందులను ఎంత ఖర్చయినా సరే భరించి ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో తాత్సారం చేయవద్దని స్పష్టం చేసింది. తమ కుమారుడి వైద్యానికి కోట్లు ఖర్చవుతాయని, అంత భరించే ఆర్థిక స్థోమత తమకు లేదంటూ అతని తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు.

దీంతో కోర్టు ఈ మేరకు తీర్పును ఇవ్వడం వారికి ఊరటను కలిగించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ బాధ్యత తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. బాలుడి కుటుంబానికి సకాలంలో ఆర్థిక సాయం అందించాలని కూడా తన తీర్పులో పేర్కొంది. శౌర్య సింగ్ అనే బాధిత బాలుడు ఈ అరుదైన జన్యులోప రోగంతో బాధపడుతున్నాడు. 'హంటింగ్టన్ సిండ్రోమ్' వ్యాధి సాధారణంగా మనిషి ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.

తీర్పు ప్రతి అందుకున్న వారం రోజుల్లోగా బాలుడి కేసును పరిశీలించాలని, కేంద్ర సాంకేతిక కమిటీకి ఆ వివరాలను తెలపాలని కోర్టు తన తీర్పులో సంబంధిత రాష్ట్ర స్థాయి సాంకేతిక, పరిపాలనా కమిటీని ఆదేశించింది. శౌర్య చికిత్స నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు విడుదల చేయాలని కూడా ఆదేశించింది. అంతేకాక అరుదైన వ్యాధుల చికిత్స కోసం 2017లో రూపొందించిన జాతీయ విధానం ప్రకారం, 2018-19 సంవత్సరానికి ఏర్పాటు చేసిన రూ.2 కోట్ల కార్పస్ ఫండ్ నుంచి 40 శాతం నిధులు విడుదలయ్యేలా చూడాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిందని బాలుడి తండ్రి సౌరభ్ మీడియాకి తెలిపారు.

More Telugu News