Encounter: మా హిట్ లిస్టులో టీఆర్ఎస్ అగ్రనేతలు: మావోయిస్టు జగన్ ఆడియో మెసేజ్

  • సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ బూటకమే
  • ముందుగానే పట్టుకొచ్చి కాల్చిచంపారు
  • ఎన్ కౌంటర్లను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్
  • మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందేనన్న మాధవ్

రెండు రోజుల క్రితం తెలంగాణ, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమని, మృతులుగా ఉన్నవారిని ముందే పట్టుకుని హింసించి, ఈ ప్రాంతానికి తెచ్చి, ఎన్ కౌంటర్ చేసినట్టు చూపించారని, ఇందుకు ప్రతీకారంగా, తెలంగాణ, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోని అధికార పార్టీ నేతలను తమ టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తామని మావోయిస్టు ప్రతినిధి జగన్ హెచ్చరించారు.

సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ నేపథ్యంలో మీడియాకు ఓ ఆడియో ప్రకటన విడుదల చేసిన ఆయన, ముందుగా అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను చిత్రహింసలకు గురిచేసి ఆపై తీసుకొచ్చి, దారుణంగా హత్య చేసి ఎన్ కౌంటర్ అని చూపించారని ఆరోపించారు. ఈ ఎన్ కౌంటర్ లో మొత్తం 10 మంది చనిపోయారని, వారి ఆశయ సాధనకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. పోలీసులు ముందు చెప్పినట్టుగా హరిభూషణ్, బడే చొక్కారావు, కంకణాల రాజిరెడ్డి మృతుల్లో లేరని అన్నారు.

కార్పొరేట్ శక్తుల కోసమే తెలంగాణ సర్కారు బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడుతోందని, అందుకు తగిన మూల్యాన్ని చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. పేదల భూమిని పెద్దలకు ధారాదత్తం చేసేందుకే మావోయిస్టుల ఎన్ కౌంటర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తన ఆడియో మెసేజ్ లో మాధవ్ ఆరోపించారు. మృతుల్లో హన్మకొండ ప్రాంతానికి చెందిన జిల్లా కమిటీ సభ్యుడు దాడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్ ఉన్నారని, మిగతావారంతా చత్తీస్ గఢ్ లోని సుక్మా, దంతెవాడ జిల్లాలకు చెందిన యువ మావోలని ఆయన తెలిపారు. ఇకపై తమ హిట్ లిస్టులో టీఆర్ఎస్ అగ్రనేతలు ఉంటారని చెప్పారు.

More Telugu News