KCR: '7 రేస్ కోర్స్ రోడ్'పై కేసీఆర్ కన్నేశారా?... ప్రధాని పదవిపై గురి!

  • దేశ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ
  • జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న యోచనలో కేసీఆర్
  • 'న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' ప్రత్యేక కథనం

నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తృతీయ కూటమి వ్యాఖ్యలు దేశ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగక పోరాడి విజయం సాధించి, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ విధానాలకు దగ్గరగా ఉండే పార్టీలను కలుపుకుని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని, అందుకు తానే నాయకత్వం వహిస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ మాటలను విశ్లేషిస్తే, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆయన మనసులోని కోరిక కనిపిస్తోందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

"జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు నేను సిద్ధమే. సమీప భవిష్యత్తులో జాతీయ రాజకీయ పరిస్థితులు మారనున్నాయి. మార్పును తీసుకువచ్చే బాధ్యతను నా భుజాలపై వేసుకునేందుకు సిద్ధం. మరో మూడు నాలుగేళ్లలో మార్పు వస్తుంది" అని కేసీఆర్ వ్యాఖ్యానించడంపై ఆంగ్ల దినపత్రిక 'న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల దాడిని ఆయన పెంచారని, ముఖ్యంగా రైతులకు మద్దతు ధర, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర సాయం, విభజన హామీల అమలు తదితరాల్లో కేంద్రం వైఫల్యం చెందిందని వ్యాఖ్యానిస్తున్నారని పత్రిక గుర్తు చేసింది.

కేసీఆర్ ఇప్పటికే తమిళనాడులోని డీఎంకేతో పాటు సమాజ్ వాదీ పార్టీ, జేడీ (ఎస్) తదితరాలతో చర్చిస్తున్నట్టు తమకు తెలిసిందని వెల్లడించింది. ఢిల్లీలోని 7 రేస్ కోర్స్ రోడ్డుపై ఆయన కన్నేశారని, ప్రధానమంత్రి పదవిని అలంకరించాలన్న కోరిక ఆయనలో ఉన్నదని అభిప్రాయపడింది. తన ప్రత్యర్థి చంద్రబాబుతోనూ మాట్లాడతానని కేసీఆర్ చెప్పారని, కాలం కలిసొస్తే, తృతీయ కూటమిలోకి తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ వంటి పార్టీలు కూడా చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.

More Telugu News