Gym trainer: త్రిపుర ముఖ్యమంత్రిగా జిమ్ ట్రైనర్?

  • ముఖ్యమంత్రి అభ్యర్థుల రేసులో ముందువరుసలో బిప్‌లాబ్ కుమార్ దేవ్
  • ఒకప్పుడు ఢిల్లీలో జిమ్ ట్రైనర్‌గా జాబ్
  • అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆయనే బీజేపీ సీఎం

ఒకప్పటి జిమ్ ట్రైనర్ నేడు త్రిపుర ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందువరుసలో ఉన్నారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు చేసి బీజేపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ ఈశాన్య రాష్ట్రాన్ని పాలించే సమర్థుడైన నేత కోసం వెతుకులాట ప్రారంభించింది. అధిష్ఠానం దృష్టి 48 ఏళ్ల బిప్‌లాబ్ కుమార్ దేవ్‌పై పడినట్టు తెలస్తోంది. పార్టీ అయనకే ఓటేస్తే కనుక ఈశాన్య రాష్ట్రాల్లో ఆయన నాలుగో బీజేపీ సీఎం అవుతారు. ప్రస్తుతం అసోంకి శర్బానంద సోనోవాల్, అరుణాచల్ ప్రదేశ్‌కు పెమా ఖండు, మణిపూర్‌కి బిరెన్ సింగ్‌లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు.

త్రిపురలో మొత్తం 59 స్థానాలకు పోటీ జరగ్గా బీజేపీ అనూహ్యంగా 43 స్థానాలను దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. విజయం అనంతరం దేవ్ మాట్లాడుతూ ఇది ప్రజావిజయమని అభివర్ణించారు. దక్షిణ త్రిపురలోని ఉదయ్‌పూర్‌లో జన్మించిన దేవ్ త్రిపుర యూనివర్సిటీ నుంచి 1999లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత న్యూఢిల్లీలో ఆరెస్సెస్‌లో పూర్తిస్థాయి శిక్షణ తీసుకున్నారు. ఈ సమయంలో కొంతకాలం పాటు ఢిల్లీ జిమ్ ట్రైనర్‌గానూ పనిచేశారు.

త్రిపుర బీజేపీ పరిశీలకుడు సునీల్ దేవధర్ ఒకసారి దేవ్‌ను కలిసినప్పుడు త్రిపుర ప్రజల కోసం పనిచేయాలంటూ ఆయనను ఆహ్వానించారు. ఈ క్రమంలో 2016లో త్రిపుర వచ్చిన దేవ్ పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. చివరికి విజయం సాధించారు. అధిష్ఠానం తనను సీఎం అభ్యర్థిగా ఎంచుకుంటే ఆ బాధ్యత తీసుకుంటానని విజయానంతరం దేవ్ పేర్కొన్నారు. అధికారంలో రాగానే మేనిఫెస్టోను అమలు చేస్తామని, ఇద్దరు జర్నలిస్టుల హత్యపై సీబీఐతో దర్యాప్తు జరిపిస్తామని పేర్కొన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాం మాధవ్, హిమంత బిస్వా, శర్మ, సునీల్ దేవధర్ వంటి వారితో కలిసి పనిచేసి దేవ్ విజయం సాధించారని ఆయన సతీమణి నీతి తెలిపారు. ఢిల్లీలోని భారతీయ స్టేట్ బ్యాంకు పార్లమెంట్ హౌస్ బ్రాంచ్‌లో ఆమె డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈ విజయం క్రెడిట్ మొత్తం తన భార్య నీతికి చెందుతుందని దేవ్ పేర్కొన్నారు. తన కోసం, తన ఇద్దరు పిల్లల కోసం ఆమె ఎంతో శ్రద్ధ తీసుకున్నారని కొనియాడారు.

More Telugu News