kenya: నాలుగు గంటల సర్జరీ తరువాత.. ఆపరేషన్ చేసింది అసలు రోగికి కాదన్న విషయాన్ని గుర్తించిన వైద్యులు!

  • కెన్యట్ట ఆసుపత్రిలో చేరిన ఇద్దరు రోగులు
  • మెదడులో గడ్డతో ఒకరు, తలవాపుతో మరొకరు 
  • మెదడులో గడ్డ ఉన్న వ్యక్తికి ఆపరేషన్ చేయబోయి, తలవాచిన వ్యక్తికి ఆపరేషన్

సర్జరీ తరువాత కడుపులో కత్తెర మర్చిపోవడం, ఒక అవయవానికి బదులుగా మరొక అవయవానికి సర్జరీ చేయడం గురించి సాధారణంగా వింటుంటాం. కానీ నిర్లక్ష్యంతో ఏకంగా ఒక రోగికి బదులు మరో రోగికి సర్జరీ చేసిన ఘటన కెన్యాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... కెన్యట్ట నేషనల్‌ హాస్పిటల్‌ ఆ దేశంలో అతిపెద్ద ఆసుపత్రి. ఆ ఆసుపత్రిలో గతవారం మెదడులో గడ్డతో ఒకరు, తల వాపుతో మరొకరు చికిత్స నిమిత్తం చేరారు. మొదటి పేషెంటుకు సర్జరీ చేసి మెదడులో గడ్డను తొలగించాల్సి రావడంతో ఆపరేషన్ కు సిబ్బంది సర్వం సిద్ధం చేశారు.

అయితే మెదడులో గడ్డ ఉన్న వ్యక్తికి బదులుగా తలవాపుతో వచ్చిన వ్యక్తిని ఆపరేషన్ గదిలోకి ఆసుపత్రి సిబ్బంది తీసుకొచ్చారు. రోగిని సరిచూసుకోని డాక్టర్లు సర్జరీ మొదలు పెట్టారు. సుమారు నాలుగు గంటలపాటు ఆపరేషన్ చేసి, పుర్రెను తెరవగా గడ్డ కనబడలేదు. దీంతో అప్పుడు గుర్తుకొచ్చి, రోగి ఎవరన్న విషయాన్ని సరిచూసిన వైద్యులు, చేసిన తప్పును గుర్తించారు.

వెంటనే పుర్రెకు కుట్లు వేసి, రోగిని అబ్జర్వేషన్లో పెట్టారు. ఈ వ్యవహారం మీడియాకు చేరడంతో హుటాహుటీన ఆసుపత్రి ఉన్నతాధికారులు ఒక డాక్టర్‌, ఇద్దరు నర్సులు, అనస్థీటిస్ట్‌ ను సస్పెండ్‌ చేశారు. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ఆసుప్రతి సీఈవోను కూడా విధుల నుంచి తొలగించారు. సర్జరీ జరిగిన రోగి కోలుకుంటున్నాడని ఆసుపత్రి తెలిపారు. 

More Telugu News