CBI: కస్టడీలో కార్తీ చిదంబరం గొంతెమ్మ కోర్కెలు...స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్‌కు వినతి...!

  • కార్తీకి ఇంటి తిండికి నో చెప్పిన న్యాయస్థానం
  • ఫుడ్ యాప్‌ల నుంచి తెప్పించుకునేందుకు అభ్యర్థన!
  • నేనున్నానంటూ కుమారుడికి తండ్రి చిదంబరం ధైర్యం

ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ నుంచి లంచం తీసుకున్న కేసులో ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నట్లు సమాచారం. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఆయన్ను ఐదు రోజుల పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. కార్తీని ఆయన లాయరు ప్రతిరోజు ఉదయం గంట, సాయంత్రం మరో గంట కలుసుకునేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. వైద్యుడి సూచనతో మందులు తెప్పించుకోవచ్చని, ఆహారాన్ని మాత్రం ఇంటి నుంచి తెప్పించుకోరాదంటూ కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో కార్తీ కస్టడీలో గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నట్లు పలు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇంటి తిండికి అనుమతిని ఇవ్వనందు వల్ల కనీసం స్విగ్గీ లేదా జొమాటో లాంటి ఫుడ్ యాప్‌ల ద్వారా ఆర్డర్ చేసేందుకు తనకు అనుమతిని ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలిసింది. కాగా, కార్తీ చిదంబరాన్ని ఒక్క రోజు పాటు సీబీఐ కస్టడీకి అప్పగించిన తర్వాత ఆయన్ని కలుసుకున్న ఆయన తండ్రి చిదంబరం 'దిగులు పడకు...నేనున్నాను' అంటూ ధైర్యం చెప్పడం గమనార్హం. ఈ కేసులో కార్తీ చిదంబరాన్ని నాటకీయ పరిణామాల నడుమ చెన్నై విమానాశ్రయంలో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News