venkatesh prasad: సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన వెంకటేష్ ప్రసాద్!

  • జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా
  • 30 నెలల పాటు బాధ్యతలను నిర్వహించిన ప్రసాద్
  • వేరే అసైన్ మెంట్ల కారణంగా రాజీనామా చేశారన్న బీసీసీఐ

టీమిండియా మాజీ పేస్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. భారత అండర్-19 జట్టు నాలుగోసారి ప్రపంచ కప్ ను గెలుచుకున్న కొన్ని రోజులకే వెంకటేష్ ప్రసాద్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను ప్రసాద్ 30 నెలల పాటు నిర్వహించారు.

వెంకటేష్ ప్రసాద్ రాజీనామాపై బీసీసీఐ స్పందించింది. క్రికెట్ కు సంబంధించిన వేరే కార్యకలాపాలకు సమయం కేటాయించే నేపథ్యంలో వెంకటేష్ ప్రసాద్ రాజీనామా చేశారని బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా తెలిపారు. అయితే, ఎలాంటి అసైన్ మెంట్ ను ఆయన చేపట్టబోతున్నారనే విషయాన్ని రాజీనామాలో పేర్కొనలేదని చెప్పారు.

వెంకటేష్ ప్రసాద్ కు ప్రత్యామ్నాయంగా ఎవర్ని తీసుకోవాలనే విషయాన్ని ఇంతవరకు తాము ఖరారు చేయలేదని తెలిపారు. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు త్వరలోనే బీసీసీఐ భేటీ అవుతుందని చెప్పారు. జూనియర్ జట్టుకు వెంకటేష్ ప్రసాద్ చేసిన సేవలు అమోఘమని కొనియాడిన ఖన్నా... రానున్న రోజుల్లో కూడా జూనియర్ జట్టు ఘన విజయాలు సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News