Warangal Rural District: శాంతి ర్యాలీకి అనుమతివ్వడం లేదని ఆత్మహత్యాయత్నం.. ఫేస్ బుక్ లైవ్ లో ప్రత్యక్ష ప్రసారం!

  • శాంతి ర్యాలీ నిర్వహించాలనుకున్న ముస్లిం హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నయీం
  • ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు
  • డీజిల్ తో నిప్పంటిచుకునే ప్రయత్నం  
  • పురుగుల మందు తాగిన నయీం

సిరియాలో జరుగుతున్న మారణకాండను వ్యతిరేకిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించేందుకు అనుమతినివ్వడం లేదని ఆరోపిస్తూ ముస్లిం హక్కుల పోరాట సమితి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ.నయీం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన వరంగల్ లో కలకలం రేపింది. దీనిని ఫేస్ బుక్ లైవ్ లో ఆయన ప్రసారం చేయడంతో సోషల్ మీడియాలో ఇది సంచలనం అయింది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... వరంగల్ లోని మచిలీబజార్ కు చెందిన ముస్లిం హక్కుల పోరాట సమితి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ.నయీం సిరియాలో జరుగుతున్న మారణకాండకు వ్యతిరేకంగా జేపీఎన్‌ రోడ్‌ లో శాంతి ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఆయనను అడ్డుకున్న పోలీసులు ర్యాలీకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దీంతో మనస్తాపం చెంది ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా, ఆయనను కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఆ తరువాత నయీం మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరోసారి పోలీసుల అనుమతి కోరారు. పోలీసులు మళ్లీ అదే సమాధానం చెప్పడంతో, కొంతమంది అనుచరులతో కలిసి జేపీఎన్ రోడ్డులోని ఒక హోటల్ కు చేరుకున్న నయీం... జరిగినది ఫేస్ బుక్ లైవ్ ద్వారా వివరించి, వెంటతెచ్చుకున్న విషపదార్థాన్ని తాగారు. దీనిని అనుచరులు అడ్డుకుని, ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

More Telugu News